హాస్టళ్లలో నాల్గవ తరగతి ఉద్యోగాల పేర్లు మార్చండి
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న నాల్గవ తరగతి సిబ్బంది హోదాలకు సంబంధించిన పేర్లను మార్చాలని ఆయా సంక్షేమ శాఖల నాల్గవ తరగతి ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు దిబ్బలమ్మ, అధ్యక్షులు శ్రీరాములు కోరారు. ఈ పేర్లతో సమాజంలో తాము వివక్షతకు గురవుతున్నామన్నారు. తమకు ఇళ్లను అద్దెకు ఇచ్చేందుకు కూడా యజమానులు ఆలోచిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కే చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి నాగేశ్వరితో కలిసి ఆయా సంక్షేమ శాఖలకు చెందిన ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలను అందించినట్లు చెప్పారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. వంట మనిషిని హాస్టల్ ఫుడ్ మేనేజర్, కమాటీని హాస్టల్ కేర్ టేకర్, వాచ్‌మెన్‌ను హాస్టల్ ప్రొటెక్షన్‌గా పిలిచే విధంగా మార్పు చేయాలని కోరామన్నారు. ఉన్నతాధికారులను కలిసిన వారిలో రాష్ట్ర కోశాధికారి కే పరమేశ్వరరావు, జిల్లా నేతలు మాధవ, మల్లీశ్వరి, సోమిబాయి తదితరులు ఉన్నారు.


