ఐక్యతతోనే ఆదోని జిల్లా సాధ్యం
ఆదోని టౌన్: అందరూ ఐక్యంగా ఉంటేనే ఆదోని జిల్లా సాధ్యం అవుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేందర్‌రెడ్డి అన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి శుక్రవారం ఆదోనికి వచ్చారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదోని జిల్లా సాధనకు కలసికట్టుగా పోరాడుదామన్నారు. ఆదోని జిల్లా కేంద్రం అయితే కేంద్రం నుంచి నిధులు వస్తాయని, అన్ని కార్యాలయాలు ఏర్పడుతాయన్నారు. ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. ఆదోని ప్రాంతం జిల్లా అయితే 60 శాతం అభివృద్ధి జరిగినట్లేనని తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


