విద్యార్థుల సంరక్షణే లక్ష్యం
● సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బీ రాధిక
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సంరక్షణే లక్ష్యంగా వసతి గృహ సంక్షేమాధికారితో పాటు నాల్గవ తరగతి సిబ్బంది విధులు నిర్వర్తించాలని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బీ రాధిక అన్నారు. స్థానిక సంక్షేమభవన్‌లోని తన చాంబర్‌లో జిల్లాలోని వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న కుక్, కమాటీలతో ఆమె ప్రత్యేక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వంట మనుషులు ప్రతి రోజు ఉదయం 6 గంటలకంతా వచ్చి రాత్రి 7 గంటల వరకు తమకు కేటాయించిన సమయాల్లో హాస్టల్‌లోనే ఉండాలన్నారు. వండిన ఆహారాన్ని వృథా చేయరాదని, విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని పెట్టాలన్నారు. కమాటీలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తమకు కేటాయించిన సమయాల్లో హాస్టల్‌లో ఉండాలన్నారు. విద్యార్థులకు కాచి చల్లార్చిన నీటిని ఇవ్వాలన్నారు. ఇతర నాల్గవ తరగతి సిబ్బంది సెలవులో ఉన్న సమయంలో వారి పనులను కూడా కమాటీ పంచుకోవాలన్నారు. ఆయా సందర్భాల్లో విద్యార్థులను స్కూల్‌కు తీసుకువెళ్లి జాగ్రత్తగా హాస్టల్‌కు తీసుకురావాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు జబ్బుతో ఉన్న విద్యార్థులకు హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు ఎస్ లీలావతి, వెంకటరాముడు, కార్యాలయ పర్యవేక్షకులు ఆలీబాషా తదితరులు పాల్గొన్నారు.


