మృత్యువులోనూ వీడని భార్యాభర్తల బంధం
కోసిగి: కష్టసుఖాల్లో తోడునీడగా ఉన్న వృద్ధ దంపతులు మృత్యువులోనూ తమ బంధాన్ని వీడలేదు. కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. డి.బెళగల్ గ్రామానికి చెందిన వై. వీరారెడ్డి (80). వై. పార్వతమ్మ(75) దాదాపు 60 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. వారు వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించారు. ఆ దంపతులకు ఒక కుమారుడు జనార్దన్ రెడ్డి, కుమార్తెలు మహాదేవి, గంగమ్మ ఉన్నారు. అందరికీ వివాహం చేసి మనవళ్లు, మనవరాళ్లుతో అన్యోన్యంగా జీవితం కాలం గడిపారు. వృద్ధాప్య వయస్సులో వై. వీరారెడ్డి మంగళవారం రాత్రి 9.30గంటలకు మృతి చెందగా, వై. పార్వతమ్మ బుధవారం తెల్లవారుజామున 4.25 గంటలకు కన్నుముశారు. ఇద్దరు ఒకే సారి మృతి చెందడంతో ఆ గ్రామ ప్రజలందరూ మంచి జీవితం అనుభవించి తనువు చాలించారంటూ కొనియాడారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యే తరపున వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి పి. మురళీ మోహన్ రెడ్డి గ్రామానికి చేరుకుని ఆ దంపతులకు పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.


