జిల్లాలో 49 స్క్రబ్ టైఫస్ కేసులు
● వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ● డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎల్.భాస్కర్
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 49 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ చెప్పారు. బుధవారం ఆయన వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్‌తో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాధి అంత తీవ్రమైనది కాదని, తక్షణ చికిత్సతో పూర్తిగా నయం అవుతుందన్నారు. ఒరియంటియా సుట్సుగముశి అనే బ్యాక్టీరియా పొలాలు, దట్టమైన పొదలలో ఉండే చిగ్గర్ మైట్‌లార్వా కాటుతో వ్యాపిస్తుందని తెలిపారు. మూడు రోజులకు పైగా జ్వరం ఉంటే సమీప హెచ్‌సీ/యుపీహెచ్‌సీలో సంప్రదించాలని సూచించారు. ప్రజలు పొదల ప్రాంతాలకు వెళ్లకుండా నివారించడం, రక్షణ దుస్తులు ధరించడం, కీటకనాశిని రెపెలెంట్లు ఉపయోగించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పొదల్లో బయట నిద్రించకూడదని, పొలాల్లో చెప్పులు లేకుండా పనిచేయవద్దని తెలిపారు.


