పత్తి దిగుబడులను వెనక్కి పంపించొద్దు
ఆదోని రూరల్: పత్తిలో తేమ శాతం సీసీఐ వారు కొనుగోలు చేసే దాని కంటే ఎక్కువ శాం ఉన్నట్లయితే రైతులను వెనక్కి పంపించకుండా మిల్లుల ద్వారా కొనుగోలు చేయించాలని మార్కెటింగ్ ఏడీని జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి ఆదేశించారు. బుధవారం ఆదోనిలో బత్తిన అభిరామ్, లక్ష్మీ చెన్నకేశవ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ యూనిట్‌లలో సీసీఐ ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. కొంచెం రంగు మారినట్లయితే కొనుగోలు చేయడం లేదని, స్లాట్ బుకింగ్‌లో సమస్యలు ఎదురవుతున్నాయని కలెక్టర్‌కు రైతులు తెలిపారు. స్పందించిన కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, స్లాట్ బుకింగ్ సమస్యను పరిష్కరించేలా చూస్తామన్నారు. అనంతరం తూకపు యంత్రాలు, మాయిశ్చరైజర్ మెసీన్‌ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయరాదని సీసీఐ అధికారులను ఆదేశించారు. ఆదోని ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్ అజయ్‌కుమార్, మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, ఏడీఏ బాలవర్ధిరాజు, తహసీల్దార్ రమేష్, సిబ్బంది ఉన్నారు.


