నామమాత్రంగా ‘రైతన్నా.. మీ కోసం’
కర్నూలు(అగ్రికల్చర్): రైతన్నా... మీ కోసం కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా జరిగిన వర్క్‌షాపులు నామమాత్రానికే పరిమితం అయ్యాయి. నవంబరు 24 నుంచి 29 వరకు రైతన్నా మీ కోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతుల నుంచి వచ్చిన సూచనలు, డిమాండ్ ఆధారంగా జిల్లాలోని 410 రైతు భరోసా కేంద్రాల్లో వర్క్‌షాపులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఎమ్మిగనూరు మండలంలో జరిగిన వర్క్‌షాప్‌లో పాల్గొనగా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పీఎల్ వరలక్ష్మి, ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2024–25 రబీ ముగింపు దశకు చేరింది. ఈ సమయంలో రబీ ప్రణాళికలు అంటూ హడావుడి చేస్తుండటంపై రైతుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొక్కజొన్న, ఉల్లి, వేరుశనగ, జొన్న, సజ్జ పంటలకు ధరలు పడిపోయినా పట్టించుకోని చంద్రబాబు సర్కార్ జీవీఏ పేరుతో అంకెల గారడీకి పాల్పడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వర్క్‌షాప్‌లలో రైతులు నామమాత్రంగా పాల్గొన్నప్పటికీ వేల మంది రైతులు పాల్గొన్నట్లు వ్యవసాయాధికారులు లెక్కలు తయారు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


