మా చెరువులోని మట్టిని మీరెందుకు తరలిస్తారు
అడ్డుకున్న పెండేకల్లు
బేతంచెర్ల: మండల పరిధిలోని ఎం.పెండేకల్లు గ్రామ పంచాయతీ పరిధిలోని మర్రికుంట, వెంకటగిరి గ్రామాల మధ్యన ఉన్న చెరువులో నుంచి మట్టి తవ్వి ఉలిందకొండలోని ఎన్‌వీర్ బ్రిక్స్‌కు తరలిస్తున్నారు. ఎవరి అనుమతి తీసుకొని తమ ఊరి చెరువులోని మట్టిని తవ్వి అక్కడికి తరలిస్తున్నారని ఎం.పేండేకల్లు పంచాయతీ ప్రజలు మంగళవారం తవ్వకాలను అడ్డుకున్నారు. తమ పొలాలకు మట్టిని తీసుకెళ్లాలంటే సవాలక్ష కారణాలు చెప్పి అడ్డుకునే అధికారులు బయటి వ్యక్తులు జేసీబీ పెట్టి తరలిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకెళ్తామన్నారు.అప్పటి వరకు మట్టి తవ్వకం జరగనివ్వమని ఎం.పెండేకల్లు, మర్రికుంట, వెంకటగిరి, రేపల్లె రైతులు పేర్కొన్నారు. దీనిపై భూగర్భ గనుల శాఖ ఏడీ రాజగోపాల్ వివరణ కోరగా మైనర్ ఇరిగేషన్ అధికారులు అనుమతి తీసుకొని రావడంతో కల్లూరు మండలం, ఉలింద కొండ గ్రామానికి చెందిన పి. నాగ భూషణంకు చెందిన ఎన్‌వీర్ బ్రిక్స్‌కు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అయితే, తవ్వకాల సమయంలో రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఏ ఒక్కరూ లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
గ్రామ పంచాయతీ ప్రజలు
మా చెరువులోని మట్టిని మీరెందుకు తరలిస్తారు


