నంద్యాలలో దారుణం
● ఇద్దరు యువకుల హత్యకు దారి తీసిన దంపతుల మధ్య గొడవ
నంద్యాల: భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. నంద్యాల పట్టణంలోని హరిజనవాడలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. నంద్యాల వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు... నాగలక్ష్మీదేవికి ముగ్గురు కుమారులు. ఇందులో ఇద్దరు కుమారులకు పెళ్లి అయ్యింది. సోమవారం రాత్రి రెండో కుమారుడు మధు, కోడలు మహాలక్ష్మి ఇంట్లో ఘర్షణ పడుతున్నారు. గమనించిన తల్లి ఇరువురిని సర్దిచెప్పడానికి వెళ్లింది. ఈ సమయంలో కోడలు మహాలక్ష్మి నాగలక్ష్మీదేవిని తోసివేయడంతో కిందపడి స్పృహ కోల్పోయింది. స్థానికులు ఆమెను ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అదే ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న నాగలక్ష్మీదేవి మూడో కుమారుడు కొమ్ము పెద్దన్న ఇంటికి వచ్చి తమ అమ్మను కొట్టి ఎందుకు తోసివేశారంటూ వదినను నిలదీశాడు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాట పెరిగింది. అక్కడే ఉన్న వదిన తమ్ముడు రాజ్‌కుమార్ కత్తి తీసుకొని విచక్షణా రహితంగా కొమ్ము పెద్దన్నపై దాడి చేశాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ గొడవను ఆపడానికి వెళ్లిన పెద్దన్న స్నేహితుడు సురేష్‌పై కూడా రాజ్‌కుమార్ కత్తితో దాడి చేయడంతో అతనికీ తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతులు పెద్దన్న, సురేష్‌లు ఇద్దరు అవివాహితులు. ఇదిలా ఉండగా మృతుల బంధువులు నిందితుల ఇళ్లపై దాడికి వెళ్లి అక్కడ ఉన్న బైక్‌ను కాల్చివేశారు. మృతదేహాలను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి రాజ్‌కుమార్, అతని అక్క మహాలక్ష్మి, తల్లిదండ్రులు సరస్వతి, లక్ష్మయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ అస్రార్‌బాషా తెలిపారు.
నంద్యాలలో దారుణం
నంద్యాలలో దారుణం


