మెడికల్ పీజీ పరీక్షా ఫలితాల్లో స్టేట్ ర్యాంకులు
కర్నూలు(హాస్పిటల్): మెడికల్ పీజీ పరీక్ష ఫలితాల్లో ఫిజియాలజి, కమ్యూనిటీ మెడిసిన్, ఫార్మకాలజి విద్యార్థులకు స్టేట్ సెకండ్, థర్డ్ ర్యాంకులు వచ్చినట్లు కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆమె తన ఛాంబర్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను, ఆయా విభాగాల వైద్యులతో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన మెడికల్ పీజీ ఫైనలియర్ పరీక్షల్లో కమ్యూనిటీ మెడిసిన్ నుంచి కొప్పోలు కీర్తన స్టేట్ సెకండ్ ర్యాంక్(592), థియరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, ఫిజియాలజి విభాగం నుంచి డాక్టర్ డి.మౌనిక స్టేట్ సెకండ్ ర్యాంక్, డాక్టర్ పి.యశ్వంత్ స్టేట్ థర్డ్ ర్యాంక్, ఫార్మకాలజి విభాగం నుంచి డాక్టర్ ఆర్, ధారణి స్టేట్ థర్డ్ ర్యాంకు సాధించారన్నారు. తమ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ హెచ్‌ఓడీ డాక్టర్ సింధియా శుభప్రద, ఫిజియాలజి హెచ్‌ఓడీ డాక్టర్ సుధారాణి, ఫార్మకాలజి హెచ్‌ఓడీ డాక్టర్ రాజేష్ పాల్గొన్నారు.


