స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో మోసం
కర్నూలు: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించి అబ్దుల్ గఫార్ ఖాన్ రూ.50 వేలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు కృష్ణా నగర్‌కు చెందిన నాయుడు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 102 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో పొలం తగాదాలు, ఉద్యోగాల పేరుతో మోసం, సైబర్ నేరాలు, నకిలీ సర్టిఫికెట్ల మోసాలు తదితర వాటిపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, రామకృష్ణ, రమేష్, జయలక్ష్మి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.


