పత్తి రైతులతో సీసీఐ చెలగాటం
కర్నూలు (అగ్రికల్చర్): పత్తి రైతుల పట్ల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గూడూరు సమీపంలోని పెంచికలపాడు జిన్నింగ్ మిల్‌కు తెచ్చిన పత్తిని తేమ శాతం ఎక్కువగా ఉందని, రంగు మారిందనే కారణాలతో తిరస్కరించారు. ఏకంగా 17 లోడులను తిరస్కరించడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇందులో పర్ల గ్రామానికి చెందిన రైతులవే 5 లోడ్లు ఉండటం గమనార్హం. ఒకవైపు కలెక్టర్, మరోవైపు వ్యవసాయ మంత్రి పత్తిలో 18 శాతం వరకు తేమను అనుమతిస్తామని, రంగు మారినా కొంటామని చెబుతున్నారు. అయితే సీసీఐ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పత్తి నాణ్యత బాగున్నా ఏకపక్షంగా తిరస్కరిస్తున్నప్పటికీ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీసీఐ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతులు సోమవారం రాత్రి జిన్నింగ్ మిల్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు పెంచికలపాడు పత్తి కొనుగోలు కేంద్రంలో దళారులకు గేట్లు ఎత్తినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


