పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
● డిసెంబర్ 10న
జిల్లా వ్యాప్తంగా నిరసనలు
కర్నూలు(సెంట్రల్): రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ ఈనెల 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమలు చేయనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పేర్కొన్నారు. సోమవారం సీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తేమ, ఇతరాత్ర కారణాలు చెప్పకుండా క్వింటాల్ పత్తిని సీసీఐ ద్వారా రూ.12 వేల ప్రకారం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అధిక వర్షాలు, తుపానులతో రైతులు పండించిన ఉల్లి, టమాట, పత్తి, వేరుశనగ పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. రైతులకు మద్దతుగా ఈనెల 12వ తేదీన అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఆలూరులో జరిగే కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ హాజరు కానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు మునెప్ప, కె. జగన్నాథం, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, పి.శ్రావణి, భారతి పాల్గొన్నారు.


