రైలు కింద పడి వివాహిత ఆత్మహత్య
కోవెలకుంట్ల: నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో శనివారం అర్ధరాత్రి ఓ వివాహిత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం నంద్యాల రైల్వే పోలీసులు అందించిన సమాచారం మేరకు.. కోవెలకుంట్ల రైల్వే స్టేషన్‌కు మూడు కి.మీ దూరంలో రైలు పట్టాలపై అడ్డంగా పడుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో తల, మొండెం వేరయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి వివరాలు ఆరా తీస్తున్నారు. మహిళ వయస్సు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందని, నలుపు, ఎరుపు, గోల్డ్‌కలర్ చెక్స్ కలిగిన చీర, అదే రంగు జాకెట్ ధరించినట్లు తెలిపారు. ఈ మేరకు గుర్తు తెలియని మహిళ మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఖలీల్ తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిస్తే 9908889696, 8367037525కు సమాచారం ఇవ్వాలని కోరారు.
‘సంతజూటూరు’లో గుర్తుతెలియని మృతదేహం
బండి ఆత్మకూరు: సంతజూటూరు పికప్ ఆనకట్ట వద్ద ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. ఎస్‌ఐ జగన్మోహన్ తెలిపిన వివరాల మేరకు.. ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహంలో కొట్టుకొని ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వచ్చిందని స్థానికులు తెలిపారన్నారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో మృతదేహాన్ని బయటకు తీయడం వీలుకాలేదన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో పాముల కలకలం
ఎమ్మిగనూరురూరల్: స్థానిక వందపడకల ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం ప్రసవాల వార్డు కిటిటీ దగ్గర రెండు పాములు కనిపించాయి. దీంతో బాలింతలు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. వెంటనే అక్కడ ఉన్న బాలింతల బంధవులు కర్రలతో కిటికీ దగ్గర ఉన్న పాములను బయటకు పంపి, వాటిని చంపివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసుపత్రి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాములు వస్తున్నాయని రోగులు చెబుతున్నారు. అధికారులు స్పందించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


