శ్రీమఠం పీఠాధిపతికి డాక్టరేట్
మంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి కొలువైన శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులకు మైలేస్ లీడర్‌షిప్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. శనివారం శ్రీమఠం ప్రాంగణంలోని యోగీంద్ర కళామండపంలో ఆఫ్రికా దేశానికి చెందిన మైలేస్ లీడర్‌షిప్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కె.రవి ఆచార్య పీఠాధిపతికి గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. పీఠాధిపతి గతంలో గుల్బార్గా యూనివర్సిటీ, బళ్లారి యూనివర్సిటీల నుంచి కూడా డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతికి శ్రీమఠం అధికారులు పూలమాలు సమర్పించి పుష్పవృష్టి కురిపించారు. కార్యక్రమంలో కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ కె.శ్రీధర్ రావు, ఫార్మర్ వైస్ చాన్సలర్ వీఆర్ పంచముఖి, మహోపాధ్యాయ డాక్టర్ హరిదాస భహత్, హాసన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ టిసి తార్నత్, లీడర్‌షిప్ యూనివర్సిటీ రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ ఎంపీడీఓలుగా 25 మందికి పోస్టింగ్స్
కర్నూలు(అర్బన్): గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా డీపీఓ, జిల్లా పరిషత్ కార్యాలయల్లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్లు, గ్రేడ్ –1 పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పించిందని జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పదోన్నతి లభించిన వారిని జిల్లాలోని 25 మండలాలకు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు వారిని ఆయా మండలాలకు కేటాయిస్తూ పోస్టింగ్స్ ఇచ్చామన్నారు. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ పోస్టింగ్స్ కీలకపాత్ర పోషిస్తాయన్నారు. డిప్యూటీ ఎంపీడీఓలుగా నియమితులైన వారందరూ ప్రభుత్వ సేవలను సకాలంలో ప్రజలకు చేరవేసేందుకు కృషి చేయాలని సీఈఓ కోరారు.
జీజీహెచ్ బ్లడ్‌బ్యాంకుకు రాష్ట్రంలో మొదటి స్థానం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని బ్లడ్‌బ్యాంకు అందించిన సేవలకు రాష్ట్రంలో మొదటి స్థానం దక్కింది. ఈ బ్లడ్‌బ్యాంకు రాష్ట్రంలోనే అత్యధికంగా 11,531 యూనిట్ల రక్తసేకరణ చేసినందుకు ఉత్తమ సేవ అవార్డుకు ఎంపికై ంది. డిసెంబర్ ఒకటో తేదిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవా ర్డు అందించనున్నారు. పెథాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ బాలీశ్వరి, బ్లడ్‌బ్యాంకు మెడికల్ ఆఫీసర్ రంగస్వామిలను కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ కె.చిట్టినరసమ్మ, పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు అభినందించారు.


