భూములు కొట్టేసేందుకే హైకోర్టు బెంచ్ డ్రామా
కర్నూలు(టౌన్): ఎకరా రూ.70 కోట్లు విలువ చేసే నగర నడిబొడ్డున ఉన్న ఏబీసీ క్వార్టర్స్ భూములపై టీడీపీ నేతల కన్ను పడింది.. వాటిని కొట్టేసేందుకే హైకోర్టు బెంచ్‌ను తెరపైకి తెచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు ఏ, బీ, సీ క్వార్టర్లలో నివసిస్తున్న రిటైర్డు ఉద్యోగులు, చిరుద్యోగులను ఈ ప్రభుత్వం వేధిస్తోందన్నారు. రాత్రికి రాత్రి ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌కు సంబంధించి ఏమైనా ఉత్తర్వులు వచ్చాయా? అని ప్రశ్నించారు. ఒకవేళ హైకోర్టు బెంచ్ వస్తే ఏ, బీ, సీ, క్వార్టర్ల సందుల్లో ఎలా పెడతారన్నారు. ఊరి బయట పెడితే అభివృద్ధికి అస్కారం ఉంటుందన్నారు. హైకోర్టు నిర్మాణం విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారన్న విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలన్నారు. రాజధాని పేరుతో రూ.77 వేల కోట్లు అప్పు చేసి లక్ష ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టడం అవసరమా? అన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం చేసే అప్పులకు ఏడాదికి వడ్డీ రూ.20 వేల కోట్లు ప్రజలపై భారం వేయడమేనన్నారు. సొంత వాళ్ల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని దివాళా దిశగా అడుగులు వేయిస్తున్నాడన్నారు. విజయవాడలో, విశాఖపట్నంలో వేలాది ఎకరాల భూ ములను కార్పొరేట్ వ్యక్తులకు పప్పులు బెల్లాలుగా కట్టబెడుతున్నారన్నారు. వైద్య కళాశాలలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయడంలో చంద్రబాబు సర్కార్ వెనుకడుగు వేయడం సిగ్గుచేటన్నారు. కార్పొరేటర్లు జుబేర్, క్రిష్ణకాంత్ రెడ్డి, పార్టీ నేతలు షరీఫ్, రాఘవేంద్ర నాయుడు, ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, తిరుమలేశ్వర రెడ్డి, నాగేష్ నాయుడు, కిషన్, ఫిరోజ్ పాల్గొన్నారు.


