కొండ చరియల ప్రమాదాన్ని నివారించేందుకు చర్యలు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం ప్రాంతంలో వర్షాకాల సీజన్‌లో తరచూ కొండ చరియలు విరిగి పడుతున్నాయి. వర్షాలకు కొండకు ఉన్న మట్టి కొట్టుకుపోయి, పటుత్వం లేక పెద్దపెద్ద కొండరాళ్లు రోడ్లపై పడుతున్నా యి. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు. కాని రోడ్లపై రాళ్లు పడడం వలన ట్రాఫిక్‌కు తరచూ తీవ్ర అంతరాయాలు ఏర్ప డుతున్నాయి. కొండచరియలు విరిగి పడకుండా చర్యలు తీసుకోవడానికి అధికారులు శనివారం పరిశీలన చేశారు. కొండలకు షార్ట్‌క్రీటింగ్ చేసి ఇనుప మెస్‌ను ఏర్పాటు చేయాలని అధి కారులు నిర్ధారణకు వచ్చారు. డ్యాం పైభాగం నుంచి లింగాలగట్టు వరకు కొండప్రాంతాలను పరిశీలించారు. పరిశీలనలో ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ శ్రీనివాసులు, సీఐ చంద్రబాబు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరమేశు ఉన్నారు.
బీఈడీ సెమిస్టర్ పరీక్షలకు
29 మంది గైర్హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షల్లో 94 శాతం హాజరు నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా శనివారం పరీక్షలకు 519 మందికి గాను 490 మంది హాజరు కాగా 29 విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు.
పన్ను చెల్లించని
రెండు స్కూల్ బస్సులు సీజ్
116 బస్సులకు నోటీసులు
కర్నూలు: విద్యాసంస్థల బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరఢా ఝళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా బడి బస్సులు తిప్పుతున్నట్లు ఫిర్యాదుల నేపథ్యంలో రవాణా శాఖ కర్నూలు డిప్యూటీ కమిషనర్ శాంత కుమారి ఆదేశాల మేరకు జిల్లాలో రవాణా శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి విద్యాసంస్థల బస్సులను తనిఖీ నిర్వహిస్తున్నారు. బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్స్, విద్యార్థులు ఎక్కి దిగేందుకు అనుగుణంగా ద్వారాలు ఉన్నాయా లేదా పరిశీలించారు. అలాగే బస్సుల సామర్థ్యత (ఫిట్‌నెస్), హెడ్ లైట్స్, సైడ్ మిర్రర్స్, కిటికీల్లో నుంచి చేతులు బయట పెట్టకుండా ఉండేందుకు గ్రిల్ ఏర్పాటు చేశారా లేదా తదితరాలను తనిఖీ చేశారు. జిల్లాలో 350కి పైగా విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. ఇందులో రెండు రోజులుగా 190 బస్సులను తనిఖీ చేసి నిబంధనలు పాటించని 116 బస్సుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. అలాగే పన్ను చెల్లించకుండా (ట్యాక్స్) తిప్పుతున్న రెండు బస్సులను సీజ్ చేశారు. డిసెంబర్ 4వ తేదీ వరకు తనిఖీలు కొనసాగుతాయని డీటీసీ శాంత కుమారి తెలిపారు.


