ప్రాణం పోసిన ప్రభుత్వాసుపత్రి
కర్నూలు(హాస్పిటల్): అతను మూడేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. తమిళనాడులోని ఓ ప్రముఖ ఆసుపత్రికి 11 సార్లు వెళ్లివచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ సూచనతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చాడు. వైద్యులు అతన్ని ఆసుపత్రిలో చేర్చుకుని అన్ని రకాల పరీక్షలు చేసి ఆపరేషన్ చేసి ప్రాణం పోశారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందులకు చెందిన ఓబులపతి(44) పాస్టర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతూ స్థానిక ఆసుపత్రులతో పాటు తెలిసిన వారు చెప్పడంతో తమిళనాడులోని ఓ ప్రముఖ ఆసుపత్రికి సైతం 11 సార్లు వెళ్లివచ్చాడు. అక్కడి వైద్యులు సైతం అతనికి అన్ని రకాల పరీక్షలు చేసి సమస్యను పరిష్కరించలేకపోయారు. దీంతో అతనికి సన్నిహితుడైన కర్నూలు జిల్లా డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి సూచన మేరకు కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అక్కడి వైద్యులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. మూడు నెలల క్రితం జనరల్ సర్జరీ వార్డులో అడ్మిట్ అయ్యాడు. ఆరవ యూనిట్ ప్రొఫెసర్ డాక్టర్ జయరామ్ అతన్ని పరీక్షించి అవసరమైన అన్ని రకాల పరీక్షలు చేశాడు. కడుపులో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారించి లాపరెక్టమి ఆపరేషన్ చేశారు. నెలరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. ఓబులపతి ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పది కిలోల బరువు పెరిగాడు. ఈ ఆనందాన్ని తనకు ప్రాణభిక్ష పెట్టిన వైద్యులతో పంచుకోవాలని శనివారం జనరల్ సర్జరీ ఓపీకి వచ్చాడు. శస్త్రచికిత్స చేసిన డాక్టర్ జయరామ్‌తో పాటు డాక్టర్ దీప్తి, డాక్టర్ జగన్‌మోహన్‌రెడ్డి, డాక్టర్ మహబూబ్‌బాషా, డాక్టర్ అరుణ్, డాక్టర్ శ్రీధర్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపాడు.


