విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఎమ్మిగనూరుటౌన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. పట్టణంలోని ఎంఎస్ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో రాష్ట్ర స్థాయి స్కూల్, గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ 17, 19 గట్కా పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ పోటీల్లో ప్రతిభను చాటి జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శేషఫణి, ఎంఈఓ ఆంజినేయులు, పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శులు నాగమణి, కృష్ణ, విశ్వనాథ్, ఆశాజ్యోతి, పాఠశాల హెచ్‌ఎం కృష్ణమూర్తి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కర్నూలు: కర్నూలు పాతబస్తీలోని ఛత్రీబాగ్ వీధిలో నివాసముంటున్న శాలిబాషా (39) రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. ఈయన బీరువాల తయారీ పని చేస్తుంటాడు. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు సంతానం. శుక్రవారం ఉదయం పనికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి ఆనంద్ థియేటర్ దగ్గర రోడ్డుపై అపస్మారక స్థితిలో పడివుండగా తెలిసిన వ్యక్తులు గుర్తించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్ల తలకు, కుడి కాలికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆటోలో ఆసుపత్రికి తరలించి వైద్యచికిత్సలు చేయించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక రాత్రి మృతి చెందాడు. భార్య జహీరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి


