కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా
● ఇద్దరికి స్వల్ప గాయాలు ● వేగం తక్కువగా ఉండటంతో అందరూ క్షేమం
తుగ్గలి: అదుపుతప్పి కర్ణాటక ఆర్టీసీ బస్సు తుగ్గలి సమీపంలో బోల్తా పడింది. శనివారం కర్ణాటక ఆర్టీసీ బస్సు(కెఎ 40ఎఫ్ 0834) బెంగళూరు నుంచి మంత్రాలయం బయలుదేరింది. తుగ్గలిలో రైల్వే బ్రిడ్జి కింద ఓ లారీ మరమ్మత్తులకు గురి కావడంతో రైల్వే స్టేషన్ రోడ్డు గుండా వెళ్లింది. మార్గమధ్యలో అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగి బోల్తాపడింది. బస్సులో 29 మంది ప్రయాణికులు ఉండగా ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. సింగిల్ రోడ్డు కావడంతో బస్సు వేగం తక్కువగా ఉండటం, బోల్తా పడిన ప్రదేశంలో రోడ్డు పక్కన చెట్లు ఉండడంతో పెద్ద ముప్పు తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. స్టీరింగ్ ఉన్న పైపు విడిపోవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్, తుగ్గలి ఎస్‌ఐ బాలనరసింహులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలపై సీఐ ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


