దళితులమని రైతులుగా గుర్తించరా?
● ఏఓ, టీడీపీ నాయకులను నిలదీసిన మహిళా రైతులు
వెల్దుర్తి: ‘ల్యాండ్ సీలింగ్ ద్వారా డీ పట్టాలు పొంది పొలాలు సాగు చేసుకుంటున్నాం.. తాము దళితులమని రైతులుగా గుర్తించరా.. అన్నదాత సుఖీభవ పథకం ఎందుకు వర్తింపజేయరు’ అంటూ వెల్దుర్తి 7వ వార్డు దళిత మహిళలు మూకుమ్మడిగా వ్యవసాయాధికారులు, టీడీపీ నాయకులను నిలదీశారు. రైతన్న మీకోసం కార్యక్రమాన్ని వెల్దుర్తి ముల్లగేరిలో శనివారం నిర్వహించారు. వ్యవసాయాధికారి (ఏఓ) అక్బర్‌బాషా, టీడీపీ మండల అధ్యక్షుడు బలరాంగౌడ్, వీఆర్‌ఓలు హాజరుకాగా వీరిని దళిత మహిళా రైతులు సోమక్క, లక్ష్మీదేవి, ఎల్లమ్మ, సుంకులమ్మ, ఈశ్వరమ్మ తదితరులు నిలదీశారు. తాము వందల ఏళ్ల నుంచి పొలం సాగు చేసుకుంటున్నామని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా అందిందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలంటూ వీఆర్‌ఓలను ఏఓ అక్బర్‌బాషా ఆదేశించారు.


