కొల్మాన్ పేటలో అంటరానితనం!
● దళిత డీలర్ రేషన్ షాపునకు తాళం
● టీడీపీ నాయకుల దురాచారం
కోసిగి: వివిధ హోదాల్లో ఉన్న దళితులను టీడీపీ నాయకులు దూరంగా ఉంచుతున్నారు. కోసిగి మండలం కొల్మాన్‌పేట గ్రామంలో దళిత డీలర్ రేషన్ షాపునకు తాళం వేసి అంటరానితనం అనే దురాచారాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఈనెల 26 నుంచి 30 వతేదీ లోగా గ్రామంలో 20 మంది వృద్ధులకు ఇంటి వద్దకు వెళ్లి రేషషన్ బియ్య పంపిణీ చేయాలి. డీలర్ మారెప్ప రెండు రోజులుగా గ్రామంలోని ఏడుగురుకి ఇంటి వద్దకు వెళ్లి రేషన్ బియ్యం అందించాడు. గురువారం సాయంత్రం రేషన్ బియ్యం పంపిణీ చేయకుండా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మదిరి లక్ష్మయ్య, కామలదొడ్డి ఉసేని అనే వ్యక్తులు షాపుకు తాళం వేశారు. దీంతో వృద్ధులకు బియ్యం పంపిణీ నిలిచిపోయింది.
చిన్నచూపు చూస్తున్నారు...
డీలర్ మారెప్ప మాట్లాడుతూ.. తాను 17 ఏళ్లుగా డీలర్‌గా ఉన్నానని, దళితుడని టీడీపీ నాయకులు చిన్నచూపు చూస్తున్నారన్నారు. తనను డీలర్ పోస్టు నుంచి తొలగించాలని నానా ఇబ్బందులు గురిచేస్తున్నారన్నారు. అధికారులతో కుమ్మకై మూడు సార్లు తనను సస్పెండ్ చేయించానన్నారు. కోర్టును ఆశ్రయించడంతో తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. దీంతో రెవెన్యూ అధికారులు రేషన్ బియ్యం వేయమని తనకు అనుమతి ఇచ్చారన్నారు. తనను డీలర్ పోస్టు నుంచి తప్పించాలని కుట్ర పన్నుతూ రేషన్ షాపునకు తాళం వేశారన్నారు. ఈవిషయంపై తహసీల్దార్ వేణుగోపాల్‌ను వివరణ కోరగా.. రెగ్యులర్ డీలర్‌గా మారెప్పకు అనుమతులు ఉన్నాయన్నారు. గ్రామ వీఆర్వోతో తాళం తీయించి రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.


