టీడీపీ నాయకుల ‘పైసా’చికం
● రైతులు భూములు ఇచ్చినా డబ్బు ఇవ్వాలని బెదిరింపులు
ఆలూరు: సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రైతులు భూములు ఇచ్చినా డబ్బులు ఇస్తేకాని రిజిస్ట్రేషన్ చేయించబోమని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. భూసేకరణ చేసిన వారిపై దాడికి యత్నించారు. ఆలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ నాయకులు హల్‌చల్ చేశారు. ఆలూరు నియోజకవర్గంలో విండ్‌పవర్, సోలార్ ప్లాంటును ఏర్పాటు చేసుకోవడానికి కొందరు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. వారి అనుచరులు, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకుని రైతుల వ్యవసాయ, వ్యవసాయేతర భూములను కొనుగోలు చేశారు. ఆలూరు మండలం హత్తిబెళగళ్ గ్రామానికి చెందిన 280 ఎకరాలను భూసేకరణ చేశారు. భూముల రిజిస్ట్రేషన్ కోసం శుక్రవారం ఆలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. టీడీపీ నాయకలు రాజశేఖర్, షేక్షావలి, ఈరన్న, గౌడు తదితరులు అక్కడి వచ్చి మామూళ్లు ఇచ్చేవరకు రైతులు ఇచ్చిన భూములను రిజిస్ట్రేషన్ చేయనిచ్చేది లేదని బెదిరించారు. కాంట్రాక్టు ఉద్యోగులనుపై దాడికి యత్నించారు. టీడీపీ నాయకుల దూషణలను చూసి పలువురు నెవ్వరుపోయారు. ఈ విషయంపై సబ్‌రిజిస్టార్ మల్లికార్జునరావు మాట్లాడుతూ.. కార్యాలయ ఆవరణలో జరిగిన విషయం గురించి తనకు తెలియదన్నారు.


