రైతులను ఇంకెప్పుడు ఆదుకుంటారు?
● ఉల్లి రైతులకు పైసా ఇవ్వలేదు ● మండల మీట్‌లో అధికారులపై ప్రజా ప్రతినిధులు మండిపాటు
పత్తికొండ: భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఇంకెప్పుడు ఆదుకుంటారు.. అంటూ వైఎస్సార్‌సీపీ హోసూరు ఎంపీటీసీ నెట్టేకల్, చిన్నహుల్తి, పెద్దహుల్తి సర్పంచ్‌లు కేశవరెడ్డి, విజయలక్ష్మి సర్వసభ్య సమావేశంలో అధికారులను నిలదీశారు. శుక్రవారం పత్తికొండ మండల పరిషత్ సమావేశం హాల్‌లో ఎంపీపీ నారాయణ్‌దాస్ ఆధ్యక్షతన మండల మీట్ జరిగింది. ఈ సమావేశంలో ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఎంపీడీఓ కవిత, తహసీల్దార్ హుశేన్‌సాహెబ్ దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రజాప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలపై వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా వ్యవసాయశాఖ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులు జాబితా రూపొందించడంలో అధికారులు నిర్లక్ష్యం వ్యహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్ట పరిహారం అందకపోతే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. టమాట రైతులు గిట్టుబాటు ధర లేక నష్టపోయిన కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లి పంటకు మార్కెట్‌లో ధర లేకపోవడంతో కొందరు పొలంలోనే వదిలేశారని, మరి కొందరు దున్నేశారన్నారు. ఉల్లి రైతులకు హెక్టారుకు రూ. 50 వేలు ప్రభుత్వం ఇస్తామని మాట చెప్పి రెండు నెలలు గడుస్తున్నా పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఖరీఫ్‌లో రైతులు సాగు చేసిన అన్ని పంటలు పూర్తిగా నష్టపోయినా అన్నదాతలు ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తుకుండా ముందు జాగ్రత్తగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ నరసింహులు, వైస్ ఎంపీపీ బలరాముడు, ఎంపీటీసీ నీలకంఠ, సర్పంచ్ పూరి శ్రీరాములు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


