● ఉపాధి కరువై.. ఊరు వదిలి
వాహనాల్లో బయలుదేరుతున్న వలస కూలీలు
ఊర్లు ఖాళీ అవుతున్నా పాలకులు, అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఓ వైపు వ్యవసాయ పనులు లేక.. మరో వైపు ఉపాధి హామీ పనులు గిట్టుబాటు గాకా.. రైతులు, వ్యవసాయ కూలీలు మూటాముల్లె సర్దుకుని పనుల కోసం ఊరు వదులుతున్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఊర్లకు ఊళ్లు ఉపాధి కోసం తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. బడి మాన్పించి పిల్లలను సైతం తల్లిదండ్రులు వెంట తీసుకెళ్తున్నారు. శుక్రవారం కుప్పగల్లు నుంచి రెండు వలస బండ్లు కదిలాయి. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదని కూలీలు వెంకోబా, ఎం.వెంకటేష్, లక్ష్మన్న, వెంకటేష్, సుధాకర్, కుమార్, చిన్న వెంకటేష్, లక్ష్మయ్య, తిరుమల, చిన్నారెడ్డి, ఎర్రిస్వామి, గోవిందరాజులు తదితరులు తెలిపారు. దాదాపు 30 కుటుంబాలు కర్ణాటకలోని సైదాపూర్, షాపూర్, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు వలస వెళ్తున్నట్లు చెప్పారు.
– ఆదోని రూరల్


