తడకనపల్లి పశువుల హాస్టల్‌పై అధ్యయనం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం రాష్ట్రంలో పశువుల హాస్టళ్ల ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉందని ఎన్‌ఆర్‌ఈజీఎస్ చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గోపిచంద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కల్లూరు మండలం తడకనపల్లి గ్రామంలో ఉన్న పశువుల వసతి గృహాన్ని సందర్శించారు. పశువుల హాస్టల్ నిర్వహణ, పశువుల పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మొదటిసారిగా కర్నూలు జిల్లాలోనే పశువుల హాస్టల్ ఏర్పాటైందని, ఇదే తరహాలో రాష్ట్రంలో మరిన్ని పశువుల హాస్టళ్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. తడకనపల్లిలోని పశువుల హాస్టల్ నిర్వహణను అధ్యయనం చేసి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు నివేదిక ఇస్తామన్నారు. పశువుల హాస్టల్‌కు సంబంధించిన అన్ని విషయాలను నిర్వాహకురాలు జుబేదా చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్‌కు వివరించారు. కార్యక్రమంలో జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు.


