పద్మశాలి నగర్‌లో చోరీ
ఆదోని అర్బన్: పట్టణ శివారు ఎమ్మిగనూరు రహదారిలో ఉన్న పద్మశాలి నగర్‌లో మూడు రోజుల క్రితం చోరీ జరిగింది. ఎస్‌ఐ రామస్వామి తెలిపిన వివరాల మేరకు.. ఇంటి యజమాని గొల్ల చంద్రశేఖర్ దంపతులు ఇంటికి తాళం వేసి పని బయటకు వెళ్లారు. మధ్యాహ్నం వారు ఇంటికొచ్చి చూడగా ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడం చూసి వెంటనే త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. బీరువా తాళాలను పగలగొట్టి, అందులో ఆరు తులాల బంగారం, 31 తులాల వెండి ఆభరణాలు, రూ.4 వేలు నగదు చోరీకి గురైనట్లు యజమాని ఫిర్యాదు చేశారు. కాగా విచారణ చేపట్టిన పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.
పట్టపగలే దోపిడీ
మంత్రాలయం రూరల్: కల్లుదేవకుండ గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన రామాంజినేయులు, లక్ష్మి దంపతులు గురువారం ఉదయం పొలానికి వెళ్లగా, కుమార్తె విరేషమ్మ మంత్రాలయంలో స్కూల్‌కు వెళ్లింది. సాయంత్రం బడి నుంచి ఇంటికి చేరుకున్న కుమార్తె తలుపులకు వేసిన తాళం పగులగొట్టి ఉండటంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. బీరువాలో ఉన్న దాదాపు రూ. 70 వేల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, పది వేల నగదు దొంగలు అపహరించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని హెడ్ కానిస్టేబుళ్లు అంజినేయులు, లక్ష్మీనారాయణ తెలిపారు.
వెల్దుర్తి: పట్టణ శివారులో యూటర్న్ వద్ద హైవే 44పైకి చేరుకున్న బైక్‌ను వేగంగా వెళ్తున్న ఐచర్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. మల్లెపల్లె గ్రామానికి చెందిన బోయ మహేశ్(31) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వెల్దుర్తి పట్టణం కొండ పేటలో నివాసముంటున్న తన తల్లి కళావతి వద్దకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో డోన్ రైల్వే గేట్ల వద్ద నుంచి హైవేపైకి చేరుకున్నాడు. యూటర్న్ ద్వారా కర్నూలు వైపు ఉన్న తన గ్రామానికి చేరుకునే ప్రయత్నంలో ఉండగా కర్నూలు వైపు నుంచి డోన్ వైపు అతివేగంగా వచ్చిన ఐచర్ లారీ బైక్‌ను ఢీకొంది. బైక్‌పై నుంచి కింద పడ్డ బోయ మహేశ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు, 108కు సమాచారం అందించారు. హైవే అంబులెన్స్‌లో స్థానిక సీహెచ్‌సీకి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతుని భార్య కృష్ణవేణి, కుటుంబ సభ్యులు, తల్లి రోదనలు మిన్నంటాయి. మృతునికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బోయ మహేశ్ హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణ నష్టం తప్పేదని ప్రమాద ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కోలుకోలేక బాలుడి మృతి
పెద్దకడబూరు: అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ కోలుకోలేక బాలుడు మృతి చెందాడు. ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన వడ్డే నాగేష్, ముత్తమ్మ దంపతుల ఏకై క కుమారుడు వడ్డే ప్రవీణ్(6) ఈ నెల 11వ తేదీన పొయి దగ్గర వెళ్లడంతో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. కుటుంబీకులు గమనించి మంటలు ఆర్పి హుటాహుటిన ఆదోని ఆస్పత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాలుడి తండ్రి నాగేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. తల్లిదండ్రులు అల్లారుముద్దుగా చూసుకుంటున్న ఒక్కగానొక్క కొడుకును బతికించుకునేందుకు చేసిన ప్రయత్నం చివరకు విఫలమై విగత జీవిగా ఇంటికి చేరడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పద్మశాలి నగర్‌లో చోరీ


