కుష్టు రహిత సమాజంగా తీర్చిదిద్దాలి
కర్నూలు(హాస్పిటల్): కుష్టు వ్యాధి రహిత సమాజం అందరి బాధ్యత అని కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ వి.శాంతారామ్ అన్నారు. జిల్లాలో కుష్టు వ్యాధి సర్వేపై కేంద్ర బృందం పరిశీలనకు వచ్చింది. ఈ బృందం గురువారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎల్.భాస్కర్‌తో సమావేశమై చర్చించారు. అనంతరం డాక్టర్ శాంతారామ్ మాట్లాడుతూ.. సర్వే సమయంలో నిబంధనల ప్రకారం అన్ని వివరాలు సేకరించి ప్రభుత్వం అందించే వైద్య సేవలను ప్రజలకు తెలపాలన్నారు. వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష లేకుండా ప్రజల్లో వైద్య సిబ్బంది అవగాహన తీసుకురావాలన్నారు. గృహ సందర్శనలకు వెళ్లినప్పుడు స్పర్శ లేని మచ్చల గురించి విచారించి అలాంటి కేసులు ఉంటే నమోదు చేయాలన్నారు. కుష్టు వ్యాధి మచ్చలుగా అనుమానిస్తే పరీక్షలు చేయించి నిర్ధారణ అయితే చికిత్స అందించాలన్నారు. ఈ వ్యాధికి సరైన సమయంలో చికిత్స చేస్తే కచ్చితంగా నయం అవుతుందన్నారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తలు నమోదు చేసిన స్పర్శ లేని మచ్చలను సంబంధిత వైద్యాధికారి చేత నిర్ధారించి చికిత్స తీసుకునేటట్లు ప్రోత్సహించాలని చెప్పారు. కేంద్ర బృందంలో డాక్టర్ రీతి తివారి, డాక్టర్ మాన్సి, రాష్ట్రస్థాయి అధికారి డాక్టర్ దేవసాగర్, కన్సల్టెంట్ సత్యవతి ఉన్నారు. సమావేశంలో న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, డీపీఎంఓ సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


