తూతూమంత్రంగా భక్త కనకదాసు జయంతి
కూటమి ప్రజాప్రతినిధులంతా డుమ్మా
కర్నూలు(సెంట్రల్): కురువల ఆరాధ్య దైవం భక్త కనకదాసు జయంతోత్సవాన్ని కూటమి ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఉత్సవాలకు స్థానికంగానే ఉన్న మంత్రి టీజీ భరత్ సహా కూటమి ప్రజప్రతినిధులంతా గైర్హాజరవడం పట్ల కురువ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో భక్త కనకదాసు జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరితోపాటు ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కావాల్సి ఉంది. అయితే ఏ ఒక్కరూ హాజరు కాకపోవడం గమనార్హం. మంత్రి టీజీ భరత్ స్థానికంగానే ఉన్నా అటువైపు తొంగి చూడని పరిస్థితి. కురువ సామాజిక వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు.. నారాలోకేష్ ప్రాపకం కోసం కల్యాణదుర్గంలో జరిగే రాష్ట్ర స్థాయి భక్త కనకదాసు జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. కురువ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప కూడా కార్యక్రమంలో పాల్గొనకపోవడం పట్ల కురువ సంఘం నాయకులు మండిపడుతున్నారు. కార్యక్రమాన్ని జేసీ నూరుల్ ఖమర్ అధ్యక్షతన మొక్కుబడిగా ముగించారు.
మనషులంతా ఒక్కటేనని
చాటిన భక్త కనకదాసు
భక్తకనకదాసు తన కీర్తనల ద్వారా భక్తితత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని బోధించి మనుషులంతా ఒక్కటేనిని చాటారని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జరిగిన భక్త కనకదాసు జయంతోత్సవంలో ఆయన భక్త కనకదాసు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భక్త కనకదాసు తన కీర్తనల ద్వారా సామాజిక సమానత్వాన్ని బోధించి ప్రజలను చైతన్యం చేశారన్నారు. ఆ కాలంలో చిన్న కులాల మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగించి మనషులంతా ఒక్కటేనని బోధించారన్నారు. ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రసూన, బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్‌హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులెవరూ హాజరు కాకపోతే జిల్లాలోని కురువలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి. జిల్లా జనాభాలో అధిక భాగం కురువలు ఉన్నారు. వారి సమస్యల పరిష్కారంపై నాయకులు, అధికారులు చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. – కురువ వెల్ఫేర్
అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరక్టర్
భక్త కనకదాసు జయంతి వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నాం. అయితే కర్నూలులో ఆ సందడి లేకపోవడం, జిల్లాలోని ప్రజాప్రతినిధులెవరూ రాకపోవడ బాధాకరం. కలెక్టర్ కూడా అందుబాటులో లేకపోవడంతో సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. ఈ పరిణామం కురువలను అవమానించడమే.
– రంగస్వామి, ప్రధాన కార్యదర్శి, కురువ సంఘం
మంత్రి టీజీ భరత్ స్థానికంగా ఉన్నా హాజరుకాకపోవడంపై కురువల ఆగ్రహం


