అక్కసుతోనే వైద్య కళాశాలల ప్రయివేటీకరణ
12న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, నిరసనలు
కర్నూలు టౌన్: ‘‘గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళశాలలను తీసుకొచ్చింది. ఇప్పటికే ఐదు వైద్య కళాశాలల్లో విద్యాభ్యాసం కొనసాగుతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసంపూర్తి కళాశాలలను పూర్తి చేస్తే ఎక్కడ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేరు వస్తుందోనని చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం దిగివచ్చే వరకు ప్రజల తరపున పోరాటం చేస్తాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ప్రజా ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరిట ప్రయివేటీకరించాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలనే డిమాండ్‌తో ఈనెల 12న జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆర్‌డీవోలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. కేవలం ప్రభుత్వ సొమ్మును దోచుకునేందుకే చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు పీపీపీ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణను అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రభుత్వంలో చలనం రాకపోతే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. ఆరోగ్యశ్రీ పేరు చెప్పగానే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గుర్తుకు వస్తారన్నారు. అయితే చంద్రబాబునాయుడు రూ.3వేల కోట్ల బకాయిలను చెల్లించకపోవడంతో ప్రయివేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందించలేని స్థితిలో ఉన్నాయన్నారు. వైఎస్‌ఆర్ పేరును చెరిపేసేందుకే ఇన్సూరెన్స్ స్కీను తెరపైకి తెచ్చారని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు ఎస్వీ విజయమనోహరి, వైఎస్సార్‌సీపీ కర్నూలు అబ్జర్వర్ కర్రా హర్షవర్థన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, కల్లా నాగవేణి రెడ్డి, కార్పొరేటర్ ఆర్షియా ఫర్హీన్, లాజరస్, కల్లా నరసింహారెడ్డి, ఫిరోజ్, కంటూ పాల్గొన్నారు.
ఆర్‌డీవోలు, తహసీల్దార్లకు
వినతిపత్రాల అందజేత
ప్రజా ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించిన
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్‌రెడ్డి


