ఈ రోడ్డులో బస్సులు నడపలేం
హొళగుంద: భారీ గుంతలు, రాళ్లు రప్పలతో అధ్వానంగా మారిన హొళగుంద–ఢణాపురం రోడ్డులో బస్సులు నడపలేమని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బస్సుల రూట్‌ను మార్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరతామని ఆర్టీసీ యూనియన్ నాయకులు, ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ రామలింగప్ప తెలిపారు. శనివారం హొళగుంద–ఢణాపురం రోడ్డులో రూట్ సర్వే చేపట్టారు. హొళగుందలో విలేకరులతో వారు మాట్లాడుతూ ఆదోని నుంచి ఢణాపురం వరకు బస్సులు నడపడం ఒక ఎత్తయితే ఢణాపురం నుంచి హొళగుందకు మరో ఎత్తవుతుందన్నారు. దాదాపు 27 కి.మీ ప్రయాణం రెండు గంటలు పడ్తుందని, ఈ రోడ్డులో బస్సులు నడిపి ఇద్దరు డ్రైవర్లు ఆస్పత్రుల పాలయ్యారని, మిగిలిన వారు ఈ రూట్‌లో బస్సులు నడపలేమని వాపోతున్నారని చెప్పారు. వారు సమస్యను యూనియన్ దృష్టికి తీసుకురావడంతో రూట్ సర్వే చేపట్టినట్లు చెప్పారు. రోడ్డు దారుణంగా ఉందని వెంటనే ఎల్లార్తి మీదుగా తిప్పేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిస్తామని, విద్యార్థి బస్సులు మాత్రమే ఈ రూట్‌లో తిప్పుతామన్నారు.


