న్యాయమైన సేవలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

న్యాయమైన సేవలే లక్ష్యం

Nov 9 2025 7:31 AM | Updated on Nov 9 2025 7:31 AM

న్యాయ

న్యాయమైన సేవలే లక్ష్యం

● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశం ఇదే ● ప్రజలకు చేరువవుతున్న న్యాయ సేవలు ● నేడు న్యాయ సేవల దినోత్సవం

సమాజంలో చివరి వ్యక్తికి న్యాయం దరి చేరాలి

● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశం ఇదే ● ప్రజలకు చేరువవుతున్న న్యాయ సేవలు ● నేడు న్యాయ సేవల దినోత్సవం

కర్నూలు(సెంట్రల్‌): చట్టం ముందు పౌరులంతా సమానమే. ఈ విషయాన్ని భారత రాజ్యాంగంలోని 14వ అధికరణ చెబుతోంది. పేదరికం, సామాజికంగా వెనుకబాటు ఇలా వివిధ కారణాలతో న్యాయం అందనివారికి ప్రభుత్వమే న్యాయ సహాయం అందించాలని, అందుకు తగిన చట్టాలు, పథకాలు ప్రవేశపెట్టాలని ఆర్టికల్‌ 39ఏ నిర్దేశిస్తోంది. ఈ లక్ష్యంలో భాగంగానే జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆవిర్భవించింది. 1985లో రూపొందించబడిన జాతీయ న్యాయ సేవా అధికారుల చట్టం 1995 నవంబర్‌ 9వ తేది నుంచి అమల్లోకి వచ్చింది. నాటి నుంచి ప్రతి ఏటా ఆ ఆరోజున జాతీయ న్యాయ సేవల దినోత్సవంగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలపై ప్రత్యేక కథనం

ఎల్‌ఏడీసీఎస్‌ ద్వారా అండర్‌ ట్రయల్‌ ఖైదీలకు న్యాయ సహాయం

జిల్లాలో లీగల్‌ ఎయిడ్‌ డెఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టమ్‌ ద్వారా అండర్‌ ట్రయల్‌ ఖైదీలు, బలహీన వర్గాలకు చెందిన నిందితులకు న్యాయ సేవలను అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 2023 జూన్‌ ఒకటి నుంచి ఇప్పటి వరకు 93 మందికి సంబంధించిన కేసులు తీసుకోగా అందులో 70 కేసులను పరిష్కరించింది. అంతేకాక ఆసంస్థ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మొత్తం 253 కేసులు తీసుకోగా అందులో ఎస్సీలకు సంబంధించి 3, ఎస్సీ మహిళలకు సంబంధించి 52, పిల్లలకు సంబంధించి 19, సాధారణం–24, రిమాండ్‌–148 కేసుల వారికి న్యాయ సహాయం అందించింది.

భూసేకరణ కేసులు

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మొత్తం 38 మందికి సంబంధించి 154 కేసుల్లో రూ. 1.18 కోట్ల రుణాన్ని రెండు జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా చెల్లింపులు చేయడంతో నిర్వాసితులకు ఎంతో ఊరట లభించింది.

మధ్యవర్తిత్వం..లోక్‌అదాలత్‌..

జిల్లా న్యాయ సేవాధికర సంస్థకు మధ్యవర్తిత్వం, లోక్‌ అదాలత్‌లు ముఖ్య వేదికలుగా వెన్నంటే ఉంటున్నాయి. కర్నూలు జిల్లాలో 2,297 కేసుల్లో 111 కేసులను మధ్యవర్తిద్వారా పరిష్కరించారు. అలాగే పర్మనెంట్‌ లోక్‌ అదాలత్‌ ద్వారా విద్యుత్‌, రవాణా, టెలికాం, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ వంటి సేవలపై ప్రజా యూటిలిటీ వివాదాల ఉంటే పరిష్కారానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తోంది. గత సంవత్సరం ఇలాంటి 138 కేసుల్లో 54 కేసులు పరిష్కరించబడ్డాయి.

జాతీయ లోక్‌ అదాలతో ప్రజలకు మరింత చేరువ

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జాతీయ లోక్‌ అదాలత్‌ల నిర్వహణతో ప్రజలకు మరింత చేరువవుతోంది. గత నాలుగు లోక్‌ అదాలత్‌లో కర్నూలు యూనిట్‌లో 876 ప్రీలిటిగేషన్‌, 1,383 సివిల్‌, 43,701 క్రిమినల్‌ కేసులను పరిష్కరించింది. అంతేకాక ఎంవీఓపీ కేసుల్లో రూ.26.47 కోట్ల పరిహారాన్ని బాధితులకు అందేలా జాతీయ లోక్‌ అదాలత్‌ చేసింది.

వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మాట్లాడుతున్న

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి (ఫైల్‌)

జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించిన కేసుకు సంబంధించిన రసీదు అందిస్తున్న

జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది (ఫైల్‌)

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న మరికొన్ని సేవలు

ప్యానెల్‌ లాయర్లు, పారాలీగల్‌ వలంటీర్లకు న్యాయ సేవలపై శిక్షణ ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఉండేలా కృషి చేస్తుంది. ప్యానెల్‌ లాయర్లు ఉచిత న్యాయం కోసం వచ్చే వారి తరఫున కోర్టుల్లో వాదిస్తారు. పారాలీగల్‌ వలంటీర్లు గ్రామాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, పునరావాస కేంద్రాలకు చేరుకొని చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పిస్తారు.

రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అధికారుల సమన్వయంతో 125 మంది నిరాధార పిల్లలకు ఆధార్‌ కార్డులు జారీ చేయించారు. ఇందులో కర్నూలులో 75, నంద్యాలలో 50 మంది ఆధార్‌ కార్డులను అందుకున్న పిల్లలు ఉన్నారు.

దూర ప్రాంత గిరిజన ప్రాంతాల్లో వైద్య, న్యాయ శిబిరాలు నిర్వహిస్తారు.

ప్రజా భద్రత కోసం 200 హెల్మెట్లు పంపిణీ చేశారు.

సమాజంలోని చివరి వ్యక్తికి న్యాయం చేరుకోవాలి అనేదే మా లక్ష్యం. న్యాయం అవగాహన ద్వారానే సాధికారత సాధ్యమవుతుంది. అన్ని శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ ప్రజలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందుబాటులో ఉంటుంది. న్యాయం అనేది ఏ ఒక్కరికీ సొంతం కాదు. న్యాయ సేవలను పొందలేని వారికి అండగా ఉండి న్యాయాన్ని ఉచితంగా అందిస్తాం. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు, బాధితులు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికీ న్యాయ సేవలు అందడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చివరి లక్ష్యం.

– బి.లీలా వెంకట శేషాద్రి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,కర్నూలు

న్యాయమైన సేవలే లక్ష్యం 1
1/1

న్యాయమైన సేవలే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement