షుగర్ రోగుల్లో ఎముకల సమస్యలు
కర్నూలు(హాస్పిటల్): షుగర్ రోగుల్లో ఎముకల సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉందని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఎండోక్రైనాలజి హెచ్‌ఓడీ డాక్టర్ పి.శ్రీనివాసులు చెప్పారు. శనివారం ఆయన తన చాంబర్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.రాధారాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ అలీమ్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరల్డ్ డయాబెటీస్ డేను పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీన కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో ‘బోన్ హెల్త్ ఇన్ డయాబెటీస్’ అనే అంశంపై నిరంతర వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అంశంపై నిమ్స్ హాస్పిటల్ ఎండోక్రైనాలజి హెచ్‌ఓడీ డాక్టర్ ెట్రీస్ యాని హాజరై ప్రసంగిస్తారన్నారు. డయాబెటీస్ (షుగర్) వచ్చిన వారికి ఆస్టియో బ్లాస్ట్ కణాలు సరిగ్గా పనిచేయవని, దానివల్ల వారి ఎముకలు బలహీనంగా మారతాయన్నారు. ఎముకల్లో సాంద్రతను తెలుసుకునేందుకు ఆసుపత్రిలో డెక్సా స్కాన్ ఏర్పాటు చేశామని, దీని ద్వారా ప్రతిరోజూ 6 నుంచి 8 మందికి స్కాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎముకలు బలహీనంగా ఉన్న వారికి ఏడాదికి ఒకసారి ఎన్‌టీఆర్ వైద్యసేవ కింద ఆసుపత్రిలో చేర్చుకుని ఇంజెక్షన్ వేస్తామన్నారు.


