ఎల్లెల్సీ కాలువలో పడి విద్యార్థి మృతి
ఆదోని రూరల్: ప్రమాదవశాత్తు ఎల్లెల్సీ కాలువలో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన వరలక్ష్మి, రంగస్వామి దంపతులకు ఇద్దరు పిల్లలు. గౌరమ్మ వేడుకల సందర్భంగా వరలక్ష్మి రెండురోజుల క్రితం పుట్టినిల్లు అయిన ఆదోని మండలం బసాపురం గ్రామానికి పిల్లలతో కలిసి వచ్చారు. శుక్రవారం సాయంత్రం చిన్న కుమారుడు హరికృష్ణ (12) తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి సమీపంలోని ఎల్లెల్సీ కాలువ వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు కాలువలో పడి నీట మునిగాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రాత్రంతా గాలించినా ఆచూకీ లభించలేదు. శనివారం మధ్యాహ్నం హాన్వాల్ గ్రామం వద్ద మృతదేహం లభ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ బాలుడు స్థానిక హాలహర్వి గ్రామంలో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రమాద సంఘటనపై ఇస్వీ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ మహేష్‌కుమార్‌ను వివరణ కోరగా బాలుడు గల్లంతైన విషయం తెలిసిందని, మృతదేహం లభ్యమైన విషయం తెలియదన్నారు.


