విష జ్వరంతో విద్యార్థిని మృతి
కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లె మోడల్ ప్రైమరీ పాఠశాల విద్యార్థిని విష జ్వరం బారిన పడి కోలుకోలేక శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన తలారి రాజు, రామాంజినమ్మ దంపతులు కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె పద్మిని(10) గ్రామంలోని పాఠశాలలో నాల్గో తరగతి చదువుతోంది. వారం రోజుల నుంచి జ్వరం రావడంతో పలు చోట్ల ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. తగ్గక పోవడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని సూచించారు. అప్పటికే రూ.60 వేల మేర వైద్యానికి ఖర్చు చేశారు. ఆర్థిక స్థోమత లేక పోవడంతో కూతురిని అనంతపురంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. చివరకు చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. పద్మిని చదువులో చురుగ్గా ఉండేదని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థిని మృతికి సంతాపంగా మధ్యాహ్నం తర్వాత పాఠశాలకు సెలవు ప్రకటించారు.


