ఉరుకుంద హుండీ ఆదాయం రూ. 1.37కోట్లు
కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలోని హుండీల్లో భక్తులు రెండు నెలలపాటు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. నగదు రూపంలో రూ.1,37,79,215 సమర్పించినట్లు ఆలయ డిప్యూటి కమిషనర్ వాణి తెలిపారు. అలాగే వెండి 18 కేజీల 990 గ్రాములు, బంగారం 6 గ్రాముల 750 మిల్లీగ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆదోని గ్రేడ్–1 కార్యనిర్వహణాధికారి రాంప్రసాద్, దేవాలయ సిబ్బంది, ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉపప్రధాన అర్చకుడు మహదేవస్వామి పాల్గొన్నారు.
వచ్చే ఐదు రోజుల్లో పొడి వాతావరణం
కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఈ నెల 12వ తేదీ వరకు ఎలాంటి వర్షసూచన లేదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉష్ణోగ్రతలు 33.2 డిగ్రీల నుంచి 33.4 డిగ్రీల వరకు నమోదు కావచ్చన్నారు. నవంబర్ నెల మొదటి వారంలో 13 మి.మీ వర్షపాతం నమోదైంది.
బాధిత కుటుంబాలకు చేయూత
మంత్రాలయం రూరల్: మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు జనవరి 21వ తేదీన కర్ణాటక రాష్ట్రం గంగవతి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం శ్రీమఠం పీఠాధిపతి మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు చొప్పున ఫిక్స్‌డ్ డిపాజి ట్ బాండ్లను వారి తల్లిదండ్రులకు అందజేశారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులకు శ్రీ మఠంలో ఉద్యోగం కల్పిస్తున్నట్లు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఎలా వేళ్లలా అండగా ఉంటామని పీఠాధినతి భరోసా కల్పించారు.
మహానందీశ్వరుడి సేవలో..
మహానంది: మహానందీశ్వరుడి సన్నిధిలో సౌత్ సెంట్రల్ రైల్వే పోలీస్ ఫోర్స్ ఐజీ ఆరోమా సింగ్ ఠాకూర్ పూజలు నిర్వహించారు. శుక్ర వారం మహానందీశ్వరుడి దర్శనానికి వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ మేరకు ఆమె శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. దర్శనం అనంతరం ఐజీ ఆరోమా సింగ్ ఠాకూర్‌కు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు.
నేటి నుంచి రాష్ట్రస్థాయి వైద్యుల సదస్సు
గోస్పాడు: నంద్యాల పట్టణంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల 37వ వార్షిక యూరాలజీ వైద్యుల వైజ్ఞానిక సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహక కార్యదర్శి యూరాలజీ డాక్టర్ భార్గవవర్ధన్‌రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. ఈనెల 8, 9 తేదీల్లో స్థానిక సౌజన్య కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు 25 మంది ప్రముఖ యూరాలజీ నిపుణులు హాజరై వివిధ అంశాలపై సదస్సులో ప్రసంగిస్తారని, దాదాపుగా 300 మంది యూరాలజీ వైద్య నిపుణులు సదస్సులో పాల్గొననున్నట్లు తెలిపారు. యూరాలజీ విభాగ పీజీ విద్యార్థులు పరిశోధన పత్రాలు సమర్పిస్తారని తెలిపారు. అనంతరం సదస్సు వివరాల పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డాక్టర్లు రమేష్, శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఉరుకుంద హుండీ ఆదాయం రూ. 1.37కోట్లు
ఉరుకుంద హుండీ ఆదాయం రూ. 1.37కోట్లు


