కర్నూలు(సెంట్రల్): భారత ఆత్మను ప్రతిబింబించే నినాదం వందేమాతరం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పేర్కొన్నారు. ఈ గీతం దేశభక్తి భావన పెంపొందిస్తుందన్నారు. కొండారెడ్డి బురుజు దగ్గర వందేమాతరం 150 ఏళ్ల సంస్మరణోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లతో కలసి శుక్రవారం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వందేమాతరం అంటే భారత జాతిని మేల్కోపే శక్తి అని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో ఉద్యమకారులకు మనోబలం, మనో నిబ్బరాన్ని ఇచ్చిన గీతానికి 150 ఏళ్లు రావడం సంతోషమన్నారు. ఈ గేయాన్ని 1875 నవంబర్ 7వ తేదీన బంకించంద్ర ఛటర్జీ రచించారని చెప్పారు. ప్రతి ఒక్కరూ జాతీయత భావాన్ని పెంపొందించుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేసీ నూరుల్ ఖమర్, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, డీఈఓ శ్యామూల్ పాల్, ఎస్‌డీసీ అనురాధ, ఆర్‌ఐఓ లాలెప్ప పాల్గొన్నారు.
డీపీఓలో ‘వందేమాతరం’ ఆలాపన
కర్నూలు: భారత స్వాతంత్య్ర సమరానికి ప్రేరణనిచ్చిన వందేమాతరం జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం వార్షికోత్సవాన్ని నిర్వహించారు. బంకించంద్ర ఛటర్జి 1875 నవంబర్ 7న జాతీయ గేయాన్ని రచించారు. 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో సామూహికంగా వందేమాతరం జాతీయ గేయాన్ని ఆలపించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్పీతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ కలసి వందేమాతరం జాతీయ గేయం ఆలాపన చేశారు. ప్రతి ఒక్కరూ జాతీయత భావాన్ని పెంపొందించుకుని దేశాభివృద్ధికి పాటు పడాలని ఎస్పీ పేర్కొన్నారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీలు బాబుప్రసాద్, ప్రసాద్, డీపీఓ పరిపాలన అధికారి విజయలక్ష్మి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
వందేమాతరంతో దేశభక్తి భావన


