బీజేపీలో చేరింది గుమ్మనూరు వర్గమే!
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
ఆలూరు రూరల్: కూటమి నాయకుల్లో ఉన్న వ్యతిరేకతతో టీడీపీకి చెందిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయులు బీజేపీలో చేరారని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి వ్యతిరేక వర్గీయులు, గుమ్మనూరు జయరాం అనుచరులు గుమ్మనూరు నారాయణ, ఆలూరు మండలం జెడ్పీటీసీ సభ్యుడు ఏరూరు శేఖర్, అరికెర సర్పంచ్ నాగరాజు, ముసానపల్లి సర్పంచ్ భర్త సోమశేఖర్, నంచర్ల ఎంపీటీసీ సభ్యుడు నరసింహులు, ఖాజీపురం సర్పంచ్... శుక్రవారం విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారన్నారు. అరికెర సర్పంచ్ నాగరాజు మూడు నెలల క్రితం వరకు వైకుంఠం ప్రధాన అనుచరుడిగా పని చేశారన్నారు. గుమ్మనూరు నారాయణ, మూసానపల్లి సర్పంచ్ సోమశేఖర్, నంచర్ల ఎంపీటీసీ సభ్యుడు నరసింహులు గుమ్మనూరు జయరాంకు ప్రధాన అనుచరులన్నారు. అయితే టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి.. సోషల్ మీడియా వేదికగా బీజేపీ పార్టీలో చేరిన వారంతా వైఎస్సార్‌సీపీకి చెందిన వారని ప్రచారం చేయడం హాస్యాస్పదం ఉందన్నారు. వీరంతా టీడీపీకి చెందిన వారని గుర్తు చేశారు. కూటమిలో బహిర్గతమైన విభేదాలను జీర్జించుకోలేక వైఎస్సార్‌సీపీపై బురదజల్లుతున్నారని పేర్కొన్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు, ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి, వైకుంఠం శివప్రసాద్‌ల మధ్య విబేధాలు ఉన్నాయి. గుమ్మనూరు జయరాం పుట్టినరోజు సందర్భంగా ఆయన వర్గీయులు ఆలూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని వైకుంఠం వర్గీయులు చించివేశారని, 20 రోజుల క్రితం గుమ్మనూరు జయరాం స్వయంగా వచ్చి వైకుంఠం అనుచరులకు వార్నింగ్ ఇచ్చారన్నారు.
రెండేళ్ల నుంచి పార్టీకి దూరంగా ఆలూరు జడ్పీటీసీ
2024 ఏడాదికి కంటే ముందు గుమ్మనూరు జయరాం వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరిన నాటి నుంచి ఆలూరు జడ్పీటీసీ ఏరూరు శేఖర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని ఎమ్మెల్యే విరూపాక్షి తెలిపారు. ఆయన అప్పటి నుంచి గుమ్మనూరు వర్గమని, 17 నెలల నుంచి వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో ఆయన పార్టీకి పని చేయలేదన్నారు.


