భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు
● రూ.10 వేలు జరిమానా
కర్నూలు: భార్య లక్ష్మిదేవిని హత్య చేసిన కేసులో భర్త శ్రీనివాసులుకు జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కమలాదేవి శుక్రవారం తీర్పునిచ్చారు. శ్రీనివాసులు 2007లో లక్ష్మీదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర్లోని శివప్ప నగర్‌లో నివాసముంటున్నారు. శ్రీనివాసులు బస్టాండ్ దగ్గర టీస్టాల్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతనిపై నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ కూడా ఉంది. పెళ్లయిన పదకొండు సంవత్సరాల తర్వాత భార్య ప్రవర్తనపై అనుమానంతో తరచూ గొడవ పడుతూ 2018 నవంబర్ 18వ తేదీన గొంతు నులిమి హత్య చేశాడు. బంధువుల ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అప్పటి దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐ మహేశ్వర్ రెడ్డి చార్జిషీటు దాఖలు చేశారు. అన్ని కోణాల్లో కేసును విచారించిన పిదప నేరం రుజువు కావడంతో ముద్దాయి శ్రీనివాసులుపై జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నిందితునికి శిక్ష పడటంలో కీలకంగా వ్యవహరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసు అధికారులు, కోర్టు కానిస్టేబుల్ వెంకటరమణ, సాక్షులను కోర్టులో హాజరుపరచిన ఏఎస్‌ఐ సుబ్బరాజు తదితరులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.


