రోడ్డు ప్రమాదంలో ఆలయ అర్చకుడు మృతి
బేతంచెర్ల: కారు, ద్విచక్రవాహనం ఢీ కొట్టిన ప్రమాదంలో ఆలయ అర్చకుడు మృతి చెందారు. ఈ దుర్ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బేతంచెర్లకు చెందిన గిరీష్ కుమార్ (37) గోరుమానుకొండ కనుమ ఆంజనేయ స్వామి ఆలయ అర్చకునిగా ఉన్నారు. కొలుములపల్లె గ్రామానికి వెళ్లి తిరిగి ద్విచక్రవాహనంపై బేతంచెర్లకు వస్తుండగా జాతీయ రహదారి వద్ద క్రాస్ రోడ్డులో డోన్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో గిరీష్ కుమార్‌కు తీవ్రగాయాలు కాడంతో చికిత్స నిమిత్తం బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారని ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతునికి భార్య రాణితో పాటు వంశీ, స్వాతి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ చెప్పారు.


