కేజీబీవీ విద్యార్థిని అదృశ్యం
చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రిలోని కేజీబీవీలో ఓ విద్యార్థిని శుక్రవారం ఉదయం నుంచి కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఉపాధ్యాయలు తల్లిదండ్రులకు తెలపడంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కదిరిపురం తండాకు చెందిన మానేపాటి చిన్న ఈశ్వరయ్య, వెంకటలక్ష్మి దంపతుల కుమారై సుష్మప్రియ(13) స్థానిక కేజీబీవీలో 6వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో యోగా తరగతి అనంతరం విద్యార్థిని బయటికి వెళ్లిపోతుండటంతో గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని పీఈటీ అలివేలిబాయి దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థినికి చదువుపట్ల ఇష్టం లేక పోవడంతో గతంలో కూడా ఒక సారి ఇలాగే విద్యాలయం నుంచి వారి బంధువుల ఊరికి వెళ్లి కొన్ని రోజుల తరువాత వచ్చినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. సుష్మప్రియ కోసం పోలీసులు, బాలిక తల్లిదండ్రులు గాలిస్తున్నట్లు ఎస్‌ఓ స్వప్న తెలిపారు. కాగా ఈ పాఠశాలకు మొయిన్ గేట్ లేక పోవడం వల్ల విద్యార్థినులకు రక్షణ కరువైంది.


