వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మురహరి రెడ్డి
కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులుగా ఎమ్మిగనూరుకు చెందిన మురహరి రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే పార్టీ రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా జి.శివ శంకర్ రెడ్డి (పాణ్యం), జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శిగా మల్లెపోగు సోమశేఖర్ ( ఎమ్మిగనూరు), జిల్లా ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులుగా మదుబాబును (ఎమ్మిగనూరు) నియమించారు. కర్నూలు నగరంలోని 52 డివిజన్లకు సంబందించి డివిజన్ల వారీగా 52 మందిని డివిజన్ అధ్యక్షులుగా నియమించారు.
పారా మెడికల్ సీట్లకు
దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలో డిప్లొమా ఇన్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ సర్వీసెస్(డిప్లొమా ఇన్ పారామెడికల్)లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఆర్‌డీఏలో బీసీ–ఏ కేటగిరీకి ఒక సీటు, ఈసీజీలో ఓసీ–పీహెచ్ కి ఒక సీటు, డీఏఎన్‌ఎస్‌లో ఓసీ–పీహెచ్‌కి ఒక సీటు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆయా కేటగిరీ లకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను నవంబర్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా కళాశాల కార్యాలయంలో సమర్పించాలని ఆమె వివరించారు.
మల్లన్న సేవలో సినీ నటులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను సినీ, టీవీ నటులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకు న్నారు. శుక్రవారం సినీ నటుడు ఛత్రపతి ఫేమ్ శేఖర్, బుల్లితెర నటుడు అమర్‌దీప్ వేర్వేరు సమయాల్లో మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అలాగే భ్రమరాంబాదేవిని దర్శించుకున్నారు. సినీ, టీవీ నటులను చూసిన పలువురు భక్తులు వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.
ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సమ్మె విరమణ
కర్నూలు (హాస్పిటల్): ప్రభుత్వం నుంచి బకాయిల విడుదలకు హామీ రావడంతో ఎన్‌టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) నెట్‌వర్క్ ఆసుపత్రులు సమ్మె విరమించినట్లు ఏపీ ప్రైవేటు స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ ఎస్వీ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌టీఆర్ వైద్యసేవ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.2,500 కోట్లకు పైగా బకాయిలు ఉండటంతో గత 20 రోజులుగా సమ్మె చేస్తున్నామన్నారు. ఇప్పటి నుంచి చేసిన ఆరోగ్యశ్రీ కేసులకు ప్రతి నెలా రూ.250 కోట్లు విడుదల చేస్తామని ప్రభు త్వం హామీ ఇచ్చిందన్నారు.
పాండురంగ స్వామి
ఆలయంలో చోరీ
హొళగుంద: వందవాగిలి గ్రామం గజ్జెళ్లి రోడ్డులో ఉన్న శ్రీరుక్మిణీ పాండురంగస్వామి ఆలయంలో గురు వారం అర్ధరాత్రి తాళిబొట్లు, కంచు గంటలను దొంగలు చోరీ చేశారు. రాత్రి సమయంలో ఆలయ తాళాలను పగులగొట్టి అమ్మ వారి మెడలోని రూ.35 వేలు విలువ చేసే 5 గ్రాముల బంగారు తాళిబొట్లు, రూ.10 వేలు విలువ చేసే రెండు కంచు గంటలను ఎత్తుకెళ్లారు. హుండీ తాళాలను కూడా పగల గొట్టేందుకు దొంగలు ప్రయత్నించారు. ఆలయ పూజారి ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల శ్రీరాంనగర్ క్యాంపు, మార్లమడికిలోని ఆలయాల్లో చోరీ జరగ్గా తాజాగా ఈ చోరీతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


