విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం
● పెచ్చులూడిన తరగతి గది పైకప్పు ● స్థల వివాదంతో మధ్యలో నిలిచిన నాడు – నేడు పనులు ● గ్రామ సచివాలయంలో తరగతుల నిర్వహణ
జూపాడుబంగ్లా: పారుమంచాల ఉర్దూ పాఠశాల విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. పాఠశాల తెరవక ముందే తరగతి గది పైకప్పు పెచ్చులు కూడి కింద పడ్డాయి. శుక్రవారం ఉదయం తరగతి గది తెరిచిన విద్యార్థులకు బెంచీలపై పెచ్చులు కనిపించాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం గ్రామంలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలను నిర్మించారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో నాడు–నేడు పథకం కింద ఈ పాఠశాలకు అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. పునాదులు తవ్వి గదుల నిర్మాణం చేపట్టారు. కాగా స్థలం విషయమై గ్రామస్తుల మధ్య వివాదం తలెత్తటంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణం పునాదులకే పరిమితమైంది. ఒకటి నుంచి ఐదు వరకు 15 మంది విద్యార్థులుండగా వారు శిథిలమైన తరగతి గదుల్లోనే విద్యను అభ్యిసిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పాఠశాల పైకప్పు పెచ్చులూడిపడ్డాయి. విషయం తెలుసుకున్న గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకులు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పాఠశాలను సందర్శించిన ఎంఈఓ–1 చిన్న మద్దిలేటి పాఠశాల తరగతులను ఎంపీడీఓ అనుమతితో పాత సచివాలయంలో నిర్వహించేలా చేశారు.
విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం


