
ప్రజల ప్రాణాలు తీస్తారా?
● వెంటనే మైనింగ్ తవ్వకాలను ఆపాలి ● ఆగ్రహం వ్యక్తం చేసిన హత్తిబెళగల్ గ్రామస్తులు ● మైనింగ్ శాఖ డీడీ కారు ముందు బైఠాయించి నిరసన
ఆలూరు రూరల్: ‘అనుమతులు లేకుండా మైనింగ్ తవ్వకాలు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తారా?’ అంటూ హత్తిబెళగల్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి అనుకొని ఉన్న క్వారీలో 2018లో పేలుడు జరిగి 14 మంది కార్మికులు మృతి చెందారని..గ్రామంలోని 40 శాతం ఇళ్లు పగుళ్లు ఏర్పడ్డాయని, మళ్లీ ఎలా పనులు చేస్తారని ప్రశ్నించారు. మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవి చంద్ర కారు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. హత్తిబెళగల్, అగ్రహారం గ్రామాల మధ్య సర్వే నంబర్ 969/పీలోని 8.094 హెక్టార్లలో మైనింగ్ తవ్వకాలకు (క్వార్ట్జ్స్) అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఏం జరిగిందంటే..
తమ గ్రామానికి ఆనుకొని ఉన్న కొండలో మైనింగ్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఈ నెల 14వ తేదీ సోమవారం హత్తిబెళగల్ గ్రామస్తులు కర్నూలులో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. క్వారీలో జరుగుతున్న పనులు నిలిపివేసి, ఆ కొండలో తవ్వకా లు జరిపితే గ్రామస్తుల ఇబ్బందులపై విచారణ జరిపి తమకు నివేదిక ఇవ్వాలని జిల్లా మైనింగ్ శాఖ డీడీ రవిచంద్రను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి జిల్లా మైనింగ్ శాఖ డీడీ శనివారం హత్తిబెళగల్ గ్రామానికి వెళ్లారు. సర్వే నంబర్ 969/పీ ఉన్న కొండను, చుట్టు పక్కల ప్రాంతాన్ని పరిశీలించారు.
గ్రామస్తుల వేదన ఇదీ..
మైనింగ్ అధికారులు వచ్చారన్న సమాచారంతో హత్తిబెళగల్ గ్రామస్తులు ఒక్క సారిగా కొండ వద్దకు చేరుకున్నారు. గ్రామానికి అనుకుని ఉన్న కొండల్లో క్వార్ట్జ్స్ తవ్వకాల కోసం పేలుళ్లు జరిపితే ప్రజల ప్రాణాలు పోతాయని, ఇళ్లు ధ్వంసం అవుతాయని వాపోయారు. ఇక్కడే క్వారీలో పేలుడు జరిగి 2018లో 14 మంది కార్మికులు మృతి చెందారని కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే సర్వే నంబరులో గ్రామానికి చెందిన 12 మందికి డీ పట్టాలు ఇచ్చారని వారందరూ కొండకు అనుకుని ఉన్న భూమి సాగుచేసుకుంటున్నారన్నారు. పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోకుండా, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా తవ్వకాలకు అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కొండలో జరుగుతున్న పనులు వెంటనే ఆపివేసి, మైనింగ్ అనుమతులు రద్దు చేసి వెళ్లాలని మైనింగ్ అధికారుల కారు ముందు బైఠాయించి నిరసన చేపట్టారు.
తహసీల్దార్‌కు ఉత్తర్వులు ఇస్తాం
గ్రామస్తుల ఆందోళనతో జిల్లా మైనింగ్ శాఖ డీడీ రవిచంద్ర స్పందించారు. ప్రజల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందించి మైనింగ్ విషయంపై సోమవారంలోగా తహసీల్దార్‌కు ఉత్తర్వులు ఇస్తామని డీడీ రవిచంద్ర హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు.