
చెంచుల పెళ్లింట విశేషాలు..
● వివాహానికి ముందు రోజు సాయంత్రం పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కుమారుడు తరఫు బంధువులంతా చేరుకుంటారు. పుట్ట మన్నుతో వివాహ వేదికను తయారు చేసి అక్కడ బాణాలను ఉంచుతారు. కొన్ని చోట్ల గంజి కావడి తెచ్చి వచ్చిన వారికి అందిస్తారు.
● ఆ రాత్రి వధూవరులకు నలుగు కార్యక్రమం ఉంటుంది. ఒక వైపు నలుగులు జరుగుతుంటే మరోవైపు అందరు కలసి నాట్యం చేస్తారు. ఈ నాట్యానికి చెంచులకు ఇష్టమైన తప్పెట వాదన ఉండనే ఉంటుంది.
● గూడెంలోని ఆడవారంతా తెల్లవారుజామునే వధూవరులను కోలగాడి (పురోహితుడు) సమక్షంలో స్నానాల బండ వద్దకు తీసుకెళ్తారు. పుక్కిట పట్టిన నీళ్లు కూడా ఒకరిపై మరొకరు పుక్కిలించుకుంటారు. (ఈ తంతు అంతా వధూవరుల మధ్య బిడియం తగ్గి పోవడానికే). అనంతరం కోలగాడు వధూవరులిద్దరికీ నూతన వస్త్రాలను అందించడంతో వివాహానికి సిద్ధమవుతారు.
● కోలగాడు దారంతో నూలుపోగు తయారు చేసి పసుపు కొమ్మును కట్టి మంగళసూత్రంగా త యారు చేస్తాడు. వరుడు పెద్దలందరికీ చూపు తూ అందరి చప్పట్ల మధ్య వధువు మెడలో కట్టడంతో వివాహ క్రతువు ముగుస్తుంది.
● పెళ్లి జరిగిన రోజు వధువు ఇంటిలో పెండ్లికి వచ్చిన వారికి పప్పన్నాన్ని మాత్రమమే వడ్డిస్తారు. అయితే వధూవరులు వరుడి ఇంటికి వచ్చిన రోజున మాంసాహారంతో విందు చేస్తారు. సారాయి సరేసరి. స్థోమతను బట్టిసంబరం జోరుగుంటుంది.
● పెళ్లి క్రతువును ఏమాత్రం భరించే శక్తి లేని వధూవరులను ఒక చోటకు చేర్చి కోలగాడు వారి కొంగులు ముడి వేసి వారి పెళ్లి అయ్యిందని ప్రకటించడంతో వారి వివాహ జీవితం ప్రారంభమవుతుంది.