
యూరియాపై టీడీపీ నేతల పెత్తనం
కర్నూలు(అగ్రికల్చర్): రైతుసేవా కేంద్రాలు, డీసీఎంఎస్‌లు, పీఏసీఎస్‌లకు కేటాయిస్తున్న యూరియాపై టీడీపీ నేతల పెత్తనం సాగుతోంది. రసాయన ఎరువును తమ అనుచరుల వద్దకు వెళ్లేలా అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. గోనెగండ్ల మండలంలో రైతుసేవా కేంద్రాలకు కేటాయించిన యూరియా టీడీపీ నేత గోదాములో ప్రత్యక్షమైంది. వ్యవసాయ అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రకటన ఇచ్చారు. కౌతాళంలోని ఓ రైతు సేవా కేంద్రానికి కేటాయించిన యూరియాపై ప్రయివేటు డీలరు పెత్తనం చెలాయించారు. వ్యవసాయ అధికారులు మాత్రం డీలరు తప్పేమీ లేదని ప్రకటిస్తున్నారు. యూరియా కోసం రైతులు దుకాణాల వద్ద, రైతుల సేవా కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలో నిరీక్షించాల్సి వస్తోంది.
గుట్టుచప్పుడు కాకుండా..
జిల్లాకు వస్తున్న యూరియా గుట్టుచప్పుడు కాకుండా కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతోంది. దీంతో కొరత ఏర్పడుతోంది. ఆదోని ర్యాక్ పాయింట్‌కు వస్తున్న యూరియా కర్ణాటక రాష్ట్రానికి తరలుతోందని విమర్శలు ఉన్నాయి. దీంతో రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరు ప్రయివేటు డీలర్లు యూరియాను బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. మరికొందరు బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయించి కాసుల పంట పండించుకుంటున్నారు.
పట్టించుకోని టీడీపీ ఎమ్మెల్యేలు
జిల్లాకు మే, జూన్ నెలల్లో రావాల్సిన యూరియాను ఇతర జిల్లాలకు తరలించారనే విమర్శలు ఉన్నాయి. అయితే జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు స్పందించలేదు. రైతులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేదు. ఆదోని ర్యాక్ పాయింట్‌కు వస్తున్న యూరియాను హోల్‌సేల్, రీటైల్ డీలర్లు బ్లాక్ చేస్తున్నా చర్యలు లేవు. అధిక ధరతో అమ్ముతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. జిల్లాలోని చాలా మండలాల్లో కొరత ఉన్నా వెల్దుర్తిలో బ్లాక్‌లో అమ్మకాలు జరుగుతున్నాయి. యూరియా బస్తా ధర రూ.263 ఉండగా రూ.400 వరకు విక్రయిస్తున్నారు.
జిల్లాకు వచ్చిన యూరియా
వివరాలు (టన్నుల్లో)
నెల లక్ష్యం వచ్చింది
ఏప్రిల్ 1,300 2,550
మే 2,800 821
జూన్ 5,245 3,216
జూలై 9,500 8,990
మొత్తం 18,845 15,577
వ్యవసాయ అధికారులు ఇచ్చిన
ప్రణాళిక ప్రకారం ఇంకా 3,268 టన్నుల యూరియా రావాల్సి ఉంది.
కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతున్న ఎరువు
కృత్రిమ కొరత సృష్టిస్తున్న డీలర్లు