
ప్లాస్టిక్‌తో మానవాళి మనుగడకు ముప్పు
కోడుమూరు రూరల్: ప్లాస్టిక్‌తో మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లుతోందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి భూమిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని జిల్లా ఇన్‌చార్జి ఆఫీసర్, రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కాంతిలాల్ దండే అన్నారు. శనివారం కర్నూలు జిల్లా కోడుమూరులో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభనుద్దేశించి ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంతో భూమి, పర్యావరణం పూర్తిగా కలుషితమైపోతున్నాయన్నారు. భూమి సారం తగ్గిపోయి పంటలు పండని పరిస్థితి నెలకొంటుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువైపోయి మైక్రో ప్లాస్టిక్ రూపంలో ప్రాణుల్లోకి చేరి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు, క్యాన్సర్ బారిన పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కోడుమూరులో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, అధికారులు పూలమాల, దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీపీఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.