
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి
కర్నూలు(అర్బన్): అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి టి. నాగరాజునాయుడు పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ నానా దుర్భాషలాడిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాల్మీకి నేతలు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న జిల్లా అధికారి పట్ల జేసీ ప్రవర్తించిన తీరును చూస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సుపరిపాలన అంటే ఇదేనా అని వారు ప్రశ్నించారు. శనివారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో వాల్మీకి/ బోయ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు కుబేరస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు తలారి కృష్ణమనాయుడు, ప్రధాన కార్యదర్శి బస్తిపాటి మల్లికార్జున, బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె. శ్రీనివాసులునాయుడు మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అండ చూసుకొని జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రవర్తించిన తీరుతో రాష్ట్రంలోని వాల్మీకుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజల ఓట్లతో పదవులు పొంది ఆయా సామాజిక వర్గాలకు చెందిన అధికారులపై దాడులు చేయడం దారుణమన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ప్రభుత్వం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు.
వాల్మీకి సంఘం నేతల డిమాండ్