మాట చెల్లక.. నేతల అలక | - | Sakshi
Sakshi News home page

మాట చెల్లక.. నేతల అలక

Jul 19 2025 1:13 PM | Updated on Jul 19 2025 1:35 PM

Kurnool Agricultural Market Committee Office

కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం

చిచ్చురేపిన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ల ప్రకటన

మంత్రి టీజీ భరత్‌, ఎంపీ నాగరాజు మధ్య విభేదాలు

బీసీ మహిళను చైర్మన్‌గా ప్రకటించకపోవడంపై ఎంపీ అసంతృప్తి

తన మాటకు విలువ లేదని సన్నిహితుల దగ్గర వాపోయిన వైనం

ఆదోని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి టీడీపీకి ఇవ్వడంపై ఎమ్మెల్యే పార్థసారధి ఆగ్రహం

ఆళ్లగడ్డ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని జనసేనకు ఇవ్వడంపై భూమా వర్గీయుల్లో వ్యతిరేకత

కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ల ప్రకటన ఇందుకు వేదికగా మారాయి. బీసీలకు విలువ లేదని కర్నూలు ఎంపీ అనగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని పట్టించుకోరా అని ఆదోని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనకు ఎలా ప్రాధాన్యం ఇస్తారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే వర్గీయులకు మండిపడుతున్నారు. తమ వర్గీయులకు పదవులు రాక, అధిష్టానం వద్ద మాట చెల్లక టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు అలక చెందారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): నామినేటెడ్‌ పద్ధతిపై నియమించిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్ల వ్యవహారం ‘కూటమి’ నేతల మధ్య చిచ్చు రేపింది. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుల మధ్య అంతరాన్ని పెంచింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ మార్కెట్‌ కమిటీలకు చైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న ప్రకటించింది. ఇందుకు సంబంధించి జీవోలు రాకపోయినప్పటికీ అధికారికంగా చైర్మన్‌లను ప్రకటించారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మహిళకు ఇవ్వడంపై మంత్రి టీజీ భరత్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు మధ్య అంతరాన్ని పెంచింది. ‘కూటమి ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులకు కనీస విలువ లేదు’ అని కర్నూలు ఎంపీ తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లు తెలుస్తోంది. మార్కెట్‌ కమిటీలకు చైర్మన్‌లను ప్రకటించడంతో ఆదోనిలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఆళ్లగడ్డలో మార్కెట్‌ కమిటీకి చైర్మన్‌గా జనసేనకు చెందిన వారిని ఎంపిక చేయడం స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది.

మంత్రి, ఎంపీ మధ్య పెరిగిన అంతరం

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా కర్నూలు మండలం రేమట గ్రామానికి చెందిన కురువ సుజాతను నియమించేందుకు ఎంపీ బస్తిపాటి నాగరాజు సర్వశక్తులు ఒడ్డారు. పూర్తి వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ మహిళను చైర్‌పర్సన్‌గా నియమిస్తే రైతుల అభ్యున్నతికి దోహదపడే అవకాశం ఉంటుందని భావించారు. ఈ నియామకం కోసం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడులను కూడా ప్రత్యేకంగా కలిశారు. చైర్‌పర్సన్‌ పీఠం ఎంపీ ప్రతిపాదించిన మహిళకే దక్కుతుందనే చర్చ కూడా నడిచింది. అయితే ఉన్నట్టుండి మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ కర్నూలు నగరానికి చెందిన అజ్మత్‌బీని ఎంపిక చేయడం ఎంపీకి, ఎంపీ వర్గీయులకు తీవ్ర అసంతృప్తిని రగిలించింది. మంత్రి టీజీ భరత్‌ సిఫార్సులకే కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. వ్యవసాయమంటే ఎరుగని వ్యాపార కుటుంబానికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి చైర్‌పర్సన్‌గా నియమించడంపై ఎంపీ వర్గీయులకు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని కలిగించింది. బీసీ ప్రజాప్రతినిధుల సిఫార్సులను కూటమి ప్రభుత్వంలో చెల్లుబాటు కావనే విషయం నిర్ధారణ అయిందనే విషయాన్ని ఎంపీ సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ నియామకం మంత్రి టీజీభరత్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు మధ్య అంతరాన్ని పెంచిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఆళ్లగడ్డ చైర్మన్‌ ప్రకటనపై భూమా వర్గీయుల ఆగ్రహం

ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా జనసేనకు చెందిన ఎం.సురేఖను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనతో భూమా వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుంటే జనసేనకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఎలా ఇస్తారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగానే ముఖ్యమంత్రిపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ అగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యే వ్యవహారంపై సీఎం కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని జనసేనకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. తాను ఎమ్మెల్యేగా ఉండగా.. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా జనసేనకు చెందిన మహిళ ఎలా పనిచేస్తుందో చూద్దాం అనే రీతిలో ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం.

టీడీపీ, బీజేపీ మధ్య పోరు తీవ్రం

ఆదోనిలో టీడీపీ, బీజేపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఆదోని టీడీపీ ఇన్‌చార్జీ మీనాక్షినాయుడు బహిరంగంగానే ఆదోని ఎమ్మెల్యే పార్థసారిధిపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల చేపట్టిన అధికారుల బదిలీల్లోనూ టీడీపీ ఇన్‌చార్జ్‌ మీనాక్షినాయుడు సిఫార్సులు పనిచేయలేదు. అన్నింటిలోను టీడీపీని ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారనే విమర్శలు మీనాక్షినాయుడు వర్గీయుల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదోని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా టీడీపీకి చెందిన జె. శారదను ప్రకటించడాన్ని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి జీర్ణించుకోలేకపోతున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా.. తాను సిఫార్సు చేసిన వారిని చైర్మన్‌గా ప్రకటించాలని, ఇందుకు విరుద్ధంగా టీడీపీ ఇన్‌చార్జ్‌ మీనాక్షినాయుడు చేసిన సిఫార్సులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే జీర్ణించుకోలేక పోతున్నారు. నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుంటే టీడీపీకి చెందిన మహిళను చైర్మన్‌గా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. చైర్మన్‌ ప్రకటన టీడీపీ, బీజేపీల మధ్య బంధాన్ని దెబ్బతీసేదిగా మారిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement