
సీమను విస్మరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు
కర్నూలు (టౌన్): రాయలసీమ అభివృద్ధిని విస్మరిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇక్కడి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్‌రెడ్డి అన్నారు. అమరావతికి ప్రాధాన్యత ఇచ్చి రాయలసీమపై ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నారని విమర్శించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డితో కలసి శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. రాయలసీమను రాళ్ల సీమగా మార్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. హంద్రీ–నీవాకు చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన హయాంలో టెంకాయలు కొట్టి వెళ్లిపోతే రూ.వేల కోట్లు ఖర్చు చేసి కాలువలు తీసి రిజర్వాయర్లు కట్టించింది మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబునాయుడు చెప్పినట్లు రాయలసీమకు రూ.90 వేల కోట్లు అవసరం లేదని, రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు.
రూ.4 కోట్లు ప్రజాధనం వృథా
రూ.4 వేల పింఛన్ ఇచ్చేందుకు పబ్లిసిటీ పేరుతో చంద్రబాబు ప్రతి నెలా రూ.4 కోట్లు ప్రజాధనం వృథా చేస్తున్నారని ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం జగన్ హయాంలో ప్రభుత్వ పథకాల పేరుతో రూ.2.67 లక్షల కోట్లు ప్రజలకు ఇంటింటికీ ఇచ్చినా ఏనాడు పబ్లిసిటీ చేయలేదన్నారు. జగనన్న హయాంలో కర్నూలుకు వచ్చిన హైకోర్టు, లా యూనివర్సిటీని తరలించారని, తాజాగా రాయలసీమ నుంచి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను తరలించాలని చూస్తున్నారన్నారు. వైద్య కళాశాలలు మంజూరు అయితే వాటిని నిర్వహించలేమని ప్రైవేటుకు అప్పగించారన్నారు. రాయలసీమ ప్రాంతంపై చిత్తశుద్ధి ఉంటే వేదావతి, గుండ్రేవుల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలు అమలు చేయక ప్రజలను మోసం చేశారన్నారు. జగనన్న జనాల్లోకి వస్తే ఈ ప్రభుత్వం ఎందుకంత భయపడుతోందన్నారు. ఎందుకు ఆంక్షలు విధిస్తుందన్నారు. ప్రజాదరణను కట్టడి చేయాలని ప్రభుత్వం ఎన్నో కుట్రలు, కుయుక్తులకు పాల్పడుతోందన్నారు.
పాలన అంతా అబద్ధాలు, మోసం
కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ.. వాజ్‌పేయ్‌ను, అబ్దుల్ కలాంను తానే నియమించా అంటున్న చంద్రబాబు రాబోయే రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు, నాగర్జున సాగర్ ప్రాజెక్టును తానే నిర్మించానన్న ఆశ్చర్యపోవాల్సిందేమీ ఉండబోదన్నారు. చంద్రబాబు పాలన అంతా అబద్ధాలు, మోసం అన్నారు. చెప్పింది చేయకపోవడమే ఆయన నైజం అన్నారు. 16 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఒక్క మంచి ప్రాజెక్టు, ఒక్క మంచి సంక్షేమ పథకం గురించి చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తి అయ్యిందని, అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు, మహిళలకు ఇచ్చిన హామీలకు ఒక్క రూపాయి విడుదల చేయలేదని విమర్శించారు. రాయలసీమ ప్రజలకు ఎప్పుడు అవకాశం వచ్చినా ఈ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతారన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి, నగరపాలక డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ షేక్ అహమ్మద్ పాల్గొన్నారు.
హైకోర్టు, లా యూనివర్సిటీలను
తరలించడం సీమకు ద్రోహం కాదా?
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి